జయకు షరతులతో బెయిల్
ఆస్తుల కేసులో సుప్రీం బెయిల్ మంజూరు
శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు కూడా...
న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మూడు వారాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు శుక్రవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు విధించిన నాలుగేళ్ల జైలుశిక్షపై చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్. దత్తూతో కూడిన ధర్మాసనం స్టే విధించి జయకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని...పైగా మహిళను, వయోవృద్ధురాలిని అయినందున ఈ కారణాలను దృష్టిలో ఉంచుకొని తనకు తక్షణమే బెయిల్ ఇవ్వాలన్న జయ విజ్ఞప్తిని కోర్టు మన్నించింది. జయతోపాటు జైలుశిక్ష అనుభవిస్తున్న ఆమె సన్నిహితురాలు శశికళ, దగ్గరి బంధువు ఇళవరసి, ఒకప్పటి దత్త పుత్రుడు సుధారకరన్‌లకు కూడా బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో రెండు నెలల్లోగా అప్పీల్‌కు సంబంధించిన వివరాలను కర్ణాటక హైకోర్టులో దాఖలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ రెండు నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకుంటే ఆ తర్వాత ఒక్క రోజు కూడా గడువు ఇవ్వబోమని తేల్చి చెప్పిం ది. పార్టీ కార్యకర్తలు శాంతిభద్రతల సమస్యలు సృష్టించకుండాచూడాలని జయనుఆదేశించింది.
బెయిల్‌పై కోర్టు తొలుత నిరాసక్తత
సుమారు గంటపాటు సాగిన విచారణలో సర్వోన్నత న్యాయస్థానం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జయకు బెయిల్ మంజూరుపై తొలుత నిరాసక్తత కనబరిచిన ధర్మాసనం అందుకు సంబంధించి పలు సందేహాలు లేవనెత్తింది. ట్రయల్ కోర్టులో ఈ కేసు విచారణను జయ ఏళ్ల తరబడి జాప్యం చేశారని... ఒకవేళ ఇప్పుడు బెయిల్‌పై విడుదల చేస్తే హైకోర్టులో కేసు అప్పీల్‌పై విచారణకు 20 ఏళ్లు పడుతుందేమోనని అనుమానం వ్యక్తం చేసింది. అయితే జయ తరఫు న్యాయవాది, ఫాలీ ఎస్. నారీమన్ వాదనలు వినిపిస్తూ హైకోర్టులో అప్పీల్‌పై జాప్యం చేయబోమని హామీ ఇచ్చారు. ‘‘హైకోర్టులో విచారణపై జాప్యం జరగదని హామీ ఇస్తున్నా. గతంలో ఇది(జాప్యం చేయడం) ఆట అయ్యుం డచ్చు. కానీ ఈసారి మాత్రం ఇది ఆట కాబోదు. వాయిదా కోరబోమన్న నా మాటను నమోదు చేసుకోండి’’ అని నారీమన్ కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ హైకోర్టులో అప్పీల్‌పై విచారణను ఎన్ని నెలల్లో ముగిస్తారని నారీమన్‌ను ప్రశ్నించగా అప్పీల్‌కు సంబంధించి 5 వేల పేజీలతో కూడిన వివరాలను అనువదించి హైకోర్టుకు సమర్పించేందుకు తనకు 6 వారాల సమయం కావాలన్నారు. అలాగే హైకోర్టులో విచారణను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో పూర్తిచేస్తామన్నారు. అప్పీల్‌పై హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకూ అవసరమైతే రెండు-మూడు నెలలు ఇంటికే పరిమితం అయ్యేందు కు కూడా జయ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అయితే గృహ నిర్బంధం వంటి అసాధారణ ఆదేశాలను జారీ చేయజాలమని ధర్మాసనం తెలిపింది. అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే తమ ఆదేశాలను జయ పాటించేలా చూసేందుకు ఆమె బెయిల్ పిటిషన్ ను పరిష్కరించినట్లు ప్రకటించకుండా విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేసింది. జయ అప్పీల్‌పై మూడు నెల ల్లోగా తీర్పు వెలువరించాలని హైకోర్టునుకోరతామని ధర్మాసనం తెలిపింది.
కార్యకర్తల సంబరాలు
చెన్నై: జయలలితకు శుక్రవారం బెయిల్ లభించడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు అభిమానులు చెన్నై సహా తమిళనాడువ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. రోడ్లపై బాణాసంచా కాలుస్తూ మిఠాయిలు పంచిపెడుతూ ఆనందంతో నృత్యాలు చేశారు. జయ జైల్లో ఉం డటంతో శుక్రవారం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని చెన్నైలోని అన్నాడీఎంకే కేంద్ర కార్యాలయంలో నిరాడంబరంగా చేసుకున్నా, బెయిల్ వార్త తెలియగానే ఘనంగా జరుపుకున్నారు. మరోవైపు కోర్టు తీర్పులు లేదా వాటిని వెలువరించిన జడ్జీలపై విమర్శలు చేయరాదని తమిళులు, నా మద్దతుదారులకు విజ్ఞప్తి చేస్తున్నానని జయ జైలు నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.