మరో రెండేళ్ల వ్యవధిలో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతున్న జయలలితకు ఊహించని షాక్ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెకు నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం శనివారం తీర్పునిచ్చింది. ఈ కేసులో ఆమెకు రూ. వంద కోట్ల జరిమానా కూడా విధించింది. జయ సన్నిహితురాలు శశికళసహా మరో ముగ్గురికి కూడా వేర్వేరు శిక్షలు పడ్డాయి. ఈ సమయంలో ఇలాంటి తీర్పు వెలువడటం రాజకీయంగా ఆమెకూ, ఆమె నాయకత్వంవహిస్తున్న అన్నా డీఎంకేకూ ఎంత నష్టదాయకమో వేరే చెప్పనవసరంలేదు. అధికారంలో ఉన్నవారు మొదటి మూడేళ్లూ ఎలా పాలించినా చివరి రెండేళ్లలో అన్నివిధాలా సర్దుకునే ప్రయత్నంచేస్తారు. పాలనలో ఏర్పడిన లోటుపాట్లను పూరించేవిధంగా వ్యూహాలు రచించు కుంటారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే జయలలిత దోషిగా నిర్ధారణ అయి, జైలుకు వెళ్లాల్సివచ్చింది.
ఆమెకు అత్యంత విశ్వాసపాత్రుడైన పన్నీరుసెల్వం సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, ఆమె నేరుగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని పాలించిన స్థాయిలో పన్నీరుసెల్వమైనా, మరొకరైనా వ్యవహరిస్తారనీ... ఆ లోటు భర్తీ చేస్తారని అనుకోలేం. అందుకు వారిని తప్పుబట్టి ప్రయోజనం లేదు. వ్యక్తి ప్రాధాన్యం అధికంగా ఉండే అన్నాడీఎంకే వంటి పార్టీ సారథ్యంవహించే సర్కారులో సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, చొరవగా వ్యవహరించడం ఇతరులకు సాధ్యపడే విషయం కూడా కాదు. ఉన్నత న్యాయస్థానంలో ఈ తీర్పు అమలుకాకుండా స్టే ఇవ్వకపోతే రాజకీయంగా జయలలితకు చాలా నష్టం ఉంటుంది. కేసులో నాలుగేళ్ల శిక్ష అనుభవించడం పూర్తయ్యాక ఆరుసంవత్సరాలు ఎన్నికల్లో పోటీచేయడానికి ఆమె అనర్హురాలవుతారు. మొత్తానికి పదేళ్లపాటు ఆమె ఎన్నికలకూ, పదవులకూ దూరంగా ఉండాల్సివస్తుంది.
1996లో కేసు నమోదైననాటినుంచి చూస్తే తీర్పు వెలువడటానికి పద్దెనిమిదేళ్ల సుదీర్ఘకాలం పట్టింది. ఇది పొరుగునున్న కర్ణాటకలోని బెంగళూరుకు బదిలీ అయ్యాక చూసుకున్నా పదకొండేళ్లు పట్టినట్టు లెక్క. ఈ కేసు 130సార్లు వాయిదాలు పడిందని, విచారణ కాలంలో ఏడుగురు న్యాయమూర్తులు మారారని విన్నప్పుడు కాస్త వింతగానే ఉంటుంది. కేసు ఒక కొలిక్కి రాకుండా చూడటానికి జయలలిత అన్ని ప్రయత్నాలూ చేశారన్నది నిజమేకావొచ్చుగానీ... అధికారంలో ఉండి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారందరిదీ దాదాపు అదే రూటు. తమపై ఆరోపణలు వచ్చినప్పుడు విచారణకు సిద్ధపడకపో వడం, చివరకు ఆ ఆరోపణలు న్యాయస్థానాల గడప తొక్కినప్పుడు వమ్ముచేయాలని చూడటం, కొన్ని సందర్భాల్లో స్టేలు తెచ్చుకుని కాల క్షేపం చేయడం మన దేశంలో సర్వసాధారణమే. జయలలిత, లాలూ, చౌతాలా, యడ్యూరప్పవంటివారు ఇందుకు మినహాయింపు కావొచ్చు.
దేశంలోనే కుల రహిత సమాజాన్ని కలగని, దాని ప్రాతిపదికన ఎన్నో సామాజిక సమస్యలపై పోరాడిన చరిత్ర ద్రవిడ ఉద్యమానిది. ఆ ఉద్యమంలోనుంచే డీకే, డీఎంకే, అన్నాడీఎంకేవంటి పార్టీలు ఆవిర్భవించాయి. తమిళ ఆత్మగౌరవం పునాదిగా పుట్టిన ఈ పార్టీలన్నీ తమ భాషనూ, సంస్కృతినీ పరిరక్షించుకోవడానికి ఎన్నో ఉద్యమాలు చేశాయి. ముఖ్యంగా హిందీ భాష ఆధిపత్యంపై ఆ పార్టీలు చేసిన పోరాటాలు దక్షిణాదిన పలు రాష్ట్రాలవారికి ఒరవడి అయ్యాయి. హేతువాదం, కాంగ్రెస్ వ్యతిరేకవాదం రెండూ ఈ పార్టీలకు రెండు కళ్లుగా ఉండేవి. అయితే ఇవన్నీ అనంతరకాలంలో వ్యక్తి కేంద్ర పార్టీలుగా మారిపోయాయి. పెరియార్ రామస్వామి ప్రవచించిన సిద్ధాంతాలను ఒక్కసారి చూస్తే డీఎంకే, అన్నా డీఎంకే వంటి పార్టీలను ద్రవిడ పార్టీలు అనవచ్చా అన్న సందేహం కలుగుతుంది. ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డాక అవినీతి ఆరోపణలు రావడం వింతేమీ కాదు. చిత్రమేమంటే, జయలలితకు శిక్షపడినట్టు వార్తలు వెలువడిన వెంటనే స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్న డీఎంకే కూడా అలాంటి సంకట స్థితిలోనే ఉన్నది. కరుణానిధి కుమార్తె కనిమొళి, బంధుగణం మారన్ సోదరులు మొదలుకొని ఆ పార్టీకి చెందిన ఎ.రాజావంటివారు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ తీర్పుతో జయలలిత రాజకీయ జీవితం ముగిసినట్టేనని కొందరు నేతలు అంటున్నారు. న్యాయపరంగా ఆమెకు ఇంకా పలు ప్రత్యామ్నాయాలు మిగిలి ఉన్నపుడు ఇలా మాట్లాడటం తొందరపాటే అవుతుంది. జయలలితను రాజకీయ పటంనుంచి చెరిపేయడం అంత సులభమేమీ కాదు. ఈ పద్దెనిమిదేళ్లలో ఆమె దాదాపు డజను కేసులు ఎదుర్కొని నిర్దోషిగా బయటికొచ్చారు. టాన్సీ భూముల కుంభకోణంలో 2001లో ఆమె దోషిగా రుజువై అయిదేళ్లు శిక్షపడ్డాక ఎన్నికల్లో పోటీచేయడం సాధ్యంకాకపోయినా లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికై సీఎం పదవి చేపట్టారు. దోషిగా నిర్ధారణైనవారు ఇలా పదవి చేపట్టడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టంచేయడంతో అదే ఏడాది సెప్టెంబర్‌లో ఆమె రాజీనామా చేయాల్సివచ్చింది. ఆ కేసులో అప్పీల్‌కు వెళ్లిన సందర్భంలో నిరపరాధిగా తేలాక 2002లో జయ మళ్లీ సీఎం అయ్యారు. నిష్పాక్షికంగా, సమర్ధవంతంగా వ్యవహరించి కేసులను తెమల్చడంలో, తీర్పులివ్వడంలో మన న్యాయస్థానాల చరిత్ర తిరుగు లేనిది. అయితే, ఈ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేవిధంగా చర్యలు తీసుకోవడం కూడా అవసరం. అలాగే అధికార దుర్వినియో గాన్ని అరికట్టేందుకు పాలనాపరంగా పారదర్శక విధానాలు అమలయ్యే లా చూడవలసి ఉన్నది. ఇలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లున్నప్పుడు అధికారంలో ఉన్నవారు అవినీతికి పాల్పడటమూ సాధ్యంకాదు. ఒకవేళ అలాంటిది జరిగినా వెనువెంటనే చర్యలు తీసుకునే వెసులుబాటూ ఉంటుంది. జయలలిత కేసునుంచి తీసుకోవాల్సిన గుణపాఠాలివే.
శరాఘాతం
Published Mon, Sep 29 2014 11:29 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement