అగ్రవర్ణాల వాళ్లంటే విదేశీయులు: బీహార్ సీఎం
బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రాం మాంఝీ మరో వివాదానికి తెరదీశారు. అగ్రవర్ణాల వాళ్లంటే విదేశీయులని, ఆర్యుల సంతతి వారసులని వ్యాఖ్యానించారు. దాంతో ఆయనపై బీజేపీ మండిపడింది. రాష్ట్రంలో కులపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించింది. అగ్రవర్ణాల వాళ్లు విదేశాల నుంచి ఇక్కడికొచ్చారని మాంఝీ వ్యాఖ్యానించారు. బెట్టాయ్ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కేవలం గిరిజనులు, దళితులు మాత్రమే ఈ దేశం వాళ్లని ఆయన అన్నారు. వాళ్లకు చదువు సంధ్యలు నేర్పించి, రాజకీయ అవగాహన కల్పించాలని, బీహార్ రాష్ట్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో వాళ్లు కీలక పాత్ర పోషించేలా చూడాలని మాంఝీ చెప్పారు.
అయితే, మాంఝీ వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా స్పందించింది. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ సీఎం వ్యాఖ్యలను ఖండించారు. వాటివల్ల బీహార్లో కులపరమైన విద్వేషాలు రెచ్చగొట్టినట్లవుతోందని అన్నారు.