‘అవినీతి జడ్జికి అందలం’
మాజీ సీజే ఐ బాలకృష్ణన్ పై కట్జూ తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ: ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షుడు జస్టిస్ మార్కండేయ కట్జూ కొత్త వివాదాన్ని లేవనెత్తారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవహక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చైర్మన్ కేజీ బాలకృష్ణన్ లక్ష్యంగా మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతి నేపథ్యం ఉన్న మద్రాసుహైకోర్టు న్యాయమూర్తి ఒకరికి, సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా ప్రమోషన్ కట్టబెట్టడానికి జస్టిస్ బాలకృష్ణన్ తీవ్రంగా ప్రయత్నించారని కట్జూ ఆరోపించారు. అవినీతి జడ్జిని సుప్రీంకోర్టు పదవి వరకూ తీసుకెళ్లడంలో జస్టిస్ బాలకృష్ణన్ అధ్యక్షతలోని కొలీజియం దాదాపుగా సఫలమైందని, జస్టిస్ ఎస్‌హెచ్ కపాడియా అందులో సభ్యుడని కట్జూ పేర్కొన్నారు. అయితే, సదరు జడ్జిపై తమిళనాడు లాయర్లు, భారీఎత్తున డాక్యుమెంటరీ ఆధారాలు చూపడంతో బాలకృష్ణన్ ప్రయత్నాలు ఫలించలేదన్నారు.
కట్జూ ఆదివారం తన బ్లాగ్‌లో తాజా ఆరోపణలు చేశారు. పూర్తిగా అనర్హుడైన జడ్జిని సుప్రీంకోర్టు స్థాయికి తెచ్చేందుకు బాలకృష్ణన్ నేతృత్వంలోని కొలీజియం ప్రయత్నించిందని, తాను మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉండగా, అక్కడే సదరు జడ్జి పనిచేశారు కాబట్టి, ఆయన అపకీర్తి ఏమిటో తనకు తెలుసుసని కూడా కట్జూ వ్యాఖ్యానించారు. అతని గురించి కొలీజియం సభ్యుడైన కపాడియాకు వివరాలందించినా, అదే జడ్జి పేరును సిఫార్సుచేయడం విచిత్రమన్నారు.
అందుబాటులో లేని బాలకృష్ణన్
కాగా, కట్డూ చేసిన ఈ ఆరోపణలపై జస్టిస్ బాలకృష్ణన్ స్పందనకోసం ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేరు. జస్టిస్ కపాడియా స్పందిస్తూ, అర్హతలేని ఏ జడ్జినీ తాను సుప్రీంకోర్టువరకూ తేలేదన్నారు. కట్జూ ఆరోపణలన్నీ అర్థరహితమైనవన్నారు. జడ్జి పేరును కూడా కట్జూ తన బ్లాగ్‌లో వెల్లడించలేదని, అతను ఎవరిగురించి ప్రస్తావిస్తున్నారో తనకు తెలియదని క పాడియా అన్నారు.