ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు.
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. దమ్ముంటే ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. గత లోక్ సభ ఎన్నికల సమయంలో ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామని ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకోవాలన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రకటన నేడో, రేపో అన్నట్లు ఉండటంతో రాష్ట్రంలో రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర బీజేపీ నేతలకు మరింత ఉత్సాహం కల్పించేందుకు ప్రధాని మోదీ శనివారం రామ్లీలా మైదాన్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి బీజేపీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సభకు అమిత్ షా కూడా హాజరు కానున్నారు. మరోవైపు ఈ నేపథ్యంలో ఢిల్లీ అంతటా మోదీకి వ్యతిరేకంగా ఆప్ పార్టీ పోస్టర్లు అంటించింది.