తిరువనంతపురం : ఒకటి కాదు రెండు కాదు ఓ మహిళకు ఏకంగా 19 సార్లు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. అంతేకాకుండా ఆమెలో ఇప్పటివరకు ఎలాంటి కరోనా లక్షణాలు కూడా బయటపడలేదు. దీంతో పరిస్థితిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షణాలు కనబడని వారితో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. వివరాల్లోకి వెళితే..కేరళ పతనమిట్ట ప్రాంతానికి చెందని 62 ఏళ్ల మహిళ కుటుంబంతో సహా ఫిబ్రవరిలో ఇటలీ వెళ్లివచ్చారు. ఆ తర్వాత సాధారణంగానే ఉంటూ అనేక కార్యక్రమాలకు హాజరయ్యారు. మార్చి 10న కుటుంబం మొత్తాన్ని క్వారంటైన్‌లో ఉంచారు. వారిలో ఐదుగురికి కరోనా పాజిటివ్ రాగా వారంతా కోలుకున్నారు.
“ఇప్పటివరకు ఆమెలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కాంబినేషన్ డ్రగ్స్‌ను మేం చాలాసార్లు ప్రయత్నించాం. అయినా పరిస్థితిలో మార్పు లేదు.” అని పతనమిట్ట జిల్లా వైద్యాదికారి డాక్టర్ ఎన్ షీజా అన్నారు. ఇప్పటికే 42 రోజులపాటు ఆమెను హాస్పిటల్‌లోనే చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. లక్షణాలు లేవు కదా అని డిశ్చార్జ్ చెయ్యడం చాలా ప్రమాదకరమని కాబట్టి కోజెన్‌చేరి హాస్పిటల్ కి తరలిస్తాం..పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకుంటే కొట్టాయం మెడికల్ కాలేజి ఆసేపత్రికి బదిలీ చేయాలని చూస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
కరోనా రోగులను 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధ సూచించింది. అయితే కేరళలో మాత్రం ఇంక్యుబేషన్ వ్యవధిని 28 రోజులవరకు పొడిగించింది. ఇటీవలే కేరళలో ఓ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ మహిళ తబ్లీగి జమాత్ సభ్యులు ప్రయాణించిన కంపార్ట్‌మెంట్‌లో పర్యటించింది. అయితే ఆమెలో 22 రోజల తర్వాత కరోనా లక్షణాలు బయటపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment