
సాక్షి, బెంగళూరు: భారీ వర్షాలతో భీతిల్లిన కర్నాటక వాసులను ఆదుకునేందుకు భారీ స్పందన లభిస్తోంది. కర్నాటక ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ పేరుతో కొడగు జిల్లాకు నిత్యావసరాలు, ఇతర ఆహార పదార్థలు ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి తమ వద్ద ఉన్న ఆహార పదార్థాల నిల్వలు చాలని, ఇక పంపవద్దని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే తగినంత ఆహార, వస్తు సామగ్రి ఉన్నందువల్ల రిలీఫ్ ఫుడ్ మెటీరియల్ పంపించడాన్ని నిలిపివేయాలని కొడగు జిల్లా ఇన్ చార్జి మంత్రి ఎస్ఆర్ మహేష్ ప్రజలకు, దాతలకు విజ్ఞప్తి చేశారు. ఇంతకుమించి సేకరించినా నిల్వ చేయడానికి స్థలం లేదని ఆయన చెప్పారు. దీనికి బదులుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బును బదిలీ చేయాలని కోరారు.
కాగా ఒకపక్క భారీ వర్షాలు, వరదలు కేరళను వణికించగా, మరోవైపు పొరుగు రాష్ట్రం కర్నాటకను కూడా భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా కొడగు జిల్లా భారీగా ప్రభావితమైంది. భారీ వర్షాల కారణంగా జిల్లాలో 8మంది మరణించగా, 4వేలమందికి పైగా నిర్వాసితులయ్యారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ ప్రాంతాల్లో వందలాదిమంది చిక్కుండిపోయారు. వర్షాల కారణంగా 123 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. 800కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ముఖ్యమంత్రి కుమారస్వామి బాధిత ప్రాంతాల్లో పర్యటించి, సహాయ పునరావాస శిబిరాలను సందర్శించి, పరిస్థితిని సమీక్షించి సంగతి తెలిసిందే.
