మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ (ఫైల్ ఫొటో)
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం- 2014 ప్రకారం ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు అందించే నిధులను వెనక్కి తీసుకుని కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టం- 2014లోని సెక్షన్ 46(2), 46(3) ప్రకారం ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికై 2017- 18 సంవత్సరానికి గానూ 350 కోట్ల రూపాయలు విడుదల చేశారని... కానీ పలు రాజకీయ కారణాల వల్ల ఆ నిధులను వెనక్కి తీసుకోవడం దారుణమని కొణతాల లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వచ్చే మూడేళ్లలో 1050 కోట్ల నిధులు ప్రత్యేక ప్యాకేజీ కింద విడుదల చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. గత రెండేళ్లుగా ఏపీ వినియోగించుకున్న 946.47 కోట్ల రూపాయలకు సంబంధించిన సర్టిఫికెట్లు ప్రభుత్వం సమర్పించిందని లేఖలో పేర్కొన్నారు. అదే తరహాలో ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన 350 కోట్ల రూపాయలు ఏపీకి విడుదల చేస్తున్నట్లు జైట్లీ ప్రకటించారని.. కానీ ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదం తెలపలేదని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రానికి ఏదో భిక్ష వేస్తున్నట్లు కేంద్రం ప్రవర్తిస్తోందని.. కానీ ఆ నిధులు పొందడం చట్టబద్ధమైన హక్కు అని.. ఈ విషయంలో మీరు చొరవ తీసుకోవాలని రాష్ట్రపతికి విఙ్ఞప్తి చేశారు.
కేబీకే(కోరాపూట్- బోలంగిర్- కలహంది) ప్లాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ మాదిరి అభివృద్ధికై ప్రత్యేక ప్యాకేజీ అందిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నామని కొణతాల తెలిపారు. ఏపీకి నిధులు విడుదల చేయడం ప్రధాని నరేంద్ర మోదీకి నచ్చడం లేదోమోనని.. అందుకే ఇలా చేసి ఉంటారని పేర్కొన్నారు. నిధులు వెనక్కి తీసుకోవడంపై ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామని, అందుకు సంబంధించిన ప్రతిని ఈ లేఖతో జత చేస్తున్నామని కొణతాల పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment