మరాఠాలను కదిలించిన రేప్‌.. | Kopardi Rape Case: Triggered Maratha Kranti Morcha | Sakshi
Sakshi News home page

మరాఠాలను కదిలించిన రేప్‌..

Published Thu, Aug 10 2017 6:55 PM | Last Updated on Sun, Sep 17 2017 5:23 PM

మరాఠాలను కదిలించిన రేప్‌..

మరాఠాలను కదిలించిన రేప్‌..

సాక్షి, న్యూఢిల్లీ: కొన్ని సమయాల్లో మౌనం,  ప్రపంచాన్ని వణికించే ప్రళయ ఘోష కన్నా భీకరంగా ఉంటుంది. అలాంటిదే మరాఠాలు బుధవారం నిర్వహించిన మహా మౌన యాత్ర. మూడు లక్షల మంది మరాఠాలు పశ్చిమ మహారాష్ట్రలోని రహదారుల్లో కదం తొక్కినా ముప్పై వేల మంది నిర్వహించే యాత్ర సందర్భంగా ఉండే అరుపులు, కేకలు లేవు. రణ నినాదాలు అంతకన్నా లేవు. ఈ ర్యాలీకి మరో విశేషణమూ ఉంది. దీన్ని ఏ రాజకీయ పార్టీ ముందస్తు ఏర్పాట్లతో నిర్వహించలేదు.

ఏ రాజకీయ పార్టీ మరాఠీలను సమీకరించలేదు. ఎవరికి వారు అక్కడి స్థానిక నేతల పిలుపు మేరకు మరాఠాలంతా స్వచ్ఛందంగా ర్యాలీకి తరలివచ్చారు. అందుకే ర్యాలీలో పాల్గొన్నవారెవరూ తాము ఫలానా పార్టీకి చెందిన వారమని చెప్పడానికీ లేదా చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. పాలకపక్ష బీజేపీ మినహా అన్ని ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలు ఈ ర్యాలీలో విశేషంగా పాల్గొన్నారు. మహారాష్ట్ర బీజేపీ నాయకుడు ఆశిష్‌ శెల్వార్‌ తన కార్యకర్తలతో కలసి ర్యాలీలో పాల్గొనేందుకు చేసిన ప్రయత్నాన్ని మరాఠాలు అడ్డుకున్నారు. మరాఠాల ర్యాలీకి మద్దతుగా ఒక్కరోజు ముందు, అంటే మంగళవారం శివసేన వేసిన పోస్టర్లను తొలగించారు.

ప్రత్యక్షంగా ఏ పార్టీ నాయకత్వం లేనందునే మహార్యాలీలో మూడు లక్షల మంది మరాఠాలు పాల్గొన్నట్లు ఉన్నారు. గత ఏదాది కాలంలో రాష్ట్రంలో మరాఠాలు 58 ర్యాలీలు నిర్వహించినా రాని జనం ఈసారి కదలి వచ్చారు. మరాఠాల డిమాండ్లపై గతంలో ఎన్నడూ దిగిరాని బీజేపీ ప్రభుత్వం ‘ఏక్‌ మరాఠా లాక్‌ మరాఠా, ఏక్‌ మరాఠా కోటి మరాఠా’ అంటూ సాగిన ఈ ర్యాలీకి కొంత మేరకైనా దిగిరాక తప్పలేదు. గత సెప్టెంబర్‌లో మరాఠా క్రాంతి మోర్చా, ఈ ఏడాది జూలై నెలలో కిసాన్‌ క్రాంతి మోర్చా పేరిట నిర్వహించిన ర్యాలీలకన్నా ఈనాటి ర్యాలీకి స్పందన ఎక్కువొచ్చింది. ఉద్యోగాలు, విద్యావకాశాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడం, వ్యవసాయ సంస్కరణలు తీసుకరావడమే మరాఠాలు నిర్వహించిన అనేక ర్యాలీల వెనకనున్న అసలు అంశం.
 
సమాజంలో పాలకులు, రణరంగ యోధులు, భూస్వాములుగా చెలామణి అవుతూవచ్చి జీవన చిత్రంలో కొంత చితికిపోయిన మరాఠీలు గతేడాది హఠాత్తుగా ఒకే వేదికపైకి వచ్చి ఏకం కావడానికి ఓ దురదృష్టకరమైన సంఘటన దారితీసింది. అదే సంచలనం సష్టించిన ‘కోపర్డి రేప్‌’ కేసు. అహ్మదనగర్‌ జిల్లాలోని కోపర్డి గ్రామంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న 14 ఏళ్ల మరాఠా బాలికపై దారుణంగా అత్యాచారం జరిగింది. ఆమె ఇంటికి కూతవేటు దూరంలో జరిగిన ఈ సంఘటనలో కాళ్లూ చేతులపై పలు చోట్ల ఎముకలు విరగడమే కాకుండా రెండు భుజాల గూడలు కిందకు జారిపోయాయి. ఈ కేసులో ముగ్గురు దళిత యువకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన మరాఠీలు ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేకుండానే మొదటిసారిగా పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు.

నిందితులను ఉరితీయాలంటూ నినాదాలు చేశారు. ఎన్నడూ లేని విధంగా వేలాది మంది మహిళలు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ముగ్గురు దళిత యువకులు చేసిన దారుణానికి మొత్తం దళితుల రిజర్వేషన్లనే ప్రశ్నించాలన్న ఉద్దేశంతో తమకూ ఉద్యోగాల్లో, విద్యావకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ నినాదం అప్పుడే అందుకున్నారు. ఆ తర్వాత ఈ డిమాండ్ల సాధన దిశగా పలు ఆందోళనలు నిర్వహించారు. ఆ తర్వాత వ్యవసాయ సంస్కరణల తీసుకరావాలనే డిమాండ్‌ను తీసుకొచ్చారు.
 
మహారాష్ట్రలో మరాఠాలు తీవ్ర అసంతప్తి, అసహనానంతో ఉండడానికి వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతినడమే కారణమని కొంతకాలంగా సామాజిక శాస్త్రవేత్తలు చెబుతూ వస్తున్నారు. వ్యవసాయ రుణాలను ఎత్తివేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ గత జూన్‌ నెలలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కిసాన్‌ క్రాంతి మోర్చా ర్యాలీలో మరాఠీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బుధవారం జరిగిన ర్యాలీలో కూడా ప్రజలు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీని విమర్శించడానికి కారణం కూడా వ్యవసాయం పట్ల ఆ ప్రభుత్వాలు చూపిస్తున్న నిర్లక్ష్యమే కారణం.

వ్యవసాయోత్పత్తులకయ్యే ఖర్చుకన్నా యాభై శాతం ఆదాయాన్ని గిట్టుబాటుగా ఇప్పిస్తానని ప్రధాని మోదీ ప్రభుత్వం తమకు హామీ ఇచ్చి మోసం చేసిందని ర్యాలీలో పాల్గొన్న పలువురు రైతులు ఆరోపించారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేయలేదని విదర్భ ప్రాంత రైతులు విమర్శించారు. రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉందంటూ సాకులు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం గత రెండున్నర ఏళ్లుగా ఎందుకు రిజాయిండర్‌ దాఖలు చేయలేదని ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు. రేప్‌ కేసును త్వరగా విచారించి దోషులను ఉరితీయాలంటూ అహ్మద్‌ ప్రాంతానికి చెందిన ఆందోళనకారులు కోరారు. ...ఇలా మరాఠాలు తమకూ సామాజిక న్యాయం కావాలంటూ ఏకమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement