
కర్ణాటక సీఎం కుమారస్వామి(పాత చిత్రం)
మీకు ఇష్టమైతే రిపోర్టు చేసుకోండి లేకపోతే లేదు.
సాక్షి, బెంగళూరు : ‘నా ప్రతీ మాటను వక్రీకరిస్తున్నారు. ఇకపై మీతో మాట్లాడే ప్రసక్తే లేదు’ అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి మీడియా ప్రతినిధులపై అసహనం వ్యక్తం చేశారు. ఓ వర్గం మీడియా(ముఖ్యంగా కన్నడ) తనను అప్రతిష్ట పాలు చేయడానికి కంకణం కట్టుకుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చెరకు మద్దతు ధర పెంచాలంటూ ఆందోళన చేస్తున్న ఓ మహిళా రైతును ‘అమ్మా.. మీరు ఈ నాలుగేళ్లు ఎక్కడ పడుకున్నారు’ అంటూ కుమారస్వామి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. (మహిళా రైతుపై సీఎం అనుచిత వ్యాఖ్యలు)
కాగా కుమారస్వామి వ్యాఖ్యలపై దుమారం రేగడంతో జేడీఎస్ మిత్రపక్షం కాంగ్రెస్ కూడా ఇబ్బందుల్లో పడింది. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష బీజేపీ విమర్శలు గుప్పించడంతో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్- కాంగ్రెస్ సమన్వయ కమిటీ చైర్మన్ సిద్దరామయ్య రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో జేడీఎస్ చీఫ్ దేవెగౌడకు ఫోన్ చేసి పబ్లిక్ మీటింగుల్లో ఎలా మాట్లాడాలో కుమారస్వామికి చెప్పాలని సూచించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడిన కుమారస్వామి.. ‘ మీడియా కారణంగా నేను ఎన్నోసార్లు బాధపడ్డాను. కావాలనే కొంతమంది నా గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. నా ప్రతీ మాటను వక్రీకరిస్తున్నారు. అవసరమనుకుంటే ఒక్కో మీడియా ప్రతినిధితో విడిగా మాట్లాడుతా. అంతేగానీ ఇకపై పత్రికా సమావేశాలకు హాజరుకాను. మీకు ఇష్టమైతే రిపోర్టు చేసుకోండి లేకపోతే లేదు. నేనేం అనుకోను’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మీడియాను దూరం పెట్టడం కుమారస్వామికి కొత్తేం కాదు. ఈ ఏడాది మే నెలలో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కూడా విధానసభలో మీడియా ప్రతినిధుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. ఈ విషయమై విమర్శలు రావడంతో జూలైలో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.