ఉద్యోగం చేసే తల్లులకు 26 వారాల ప్రసూతి సెలవు అందించే యోచనలో ఉన్నట్టు కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు.
న్యూఢిల్లీ: ప్రసూతి బెనిఫిట్ చట్టం లో సవరణలు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఉద్యోగం చేసే తల్లులకు 26 వారాల ప్రసూతి సెలవు అందించే యోచనలో ఉన్నట్టు కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవార ప్రకటించారు. ప్రభుత్వం ఉద్యోగం చేసే మహిళలకు ఇప్పటికే ఈ సదుపాయం ఉన్నప్పటికీ ప్రయివేట్ సెక్టార్ లో అన్నిచోట్లా అమల్లో లేదని తెలిపారు. ఇంటి నుంచి పని చేసే సదుసాయం మహిళలకు అందుబాటులో ఉండడం లేదని.. అందుకే ఈ సవరణకు ప్రతిపాదించనున్నట్టు చెప్పారు. అలాగే వర్క్ ఫ్రమ్ హోం అనే అవకాశాన్ని మాండేటరీ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు.
ప్రస్తుతం అమలులో ఉన్న 12 వారాల సెలవును 26 వారాలకు పెంచేందుకు వీలు కల్పించేలా కొత్త ప్రసూతి బెనిఫిట్ బిల్లును త్వరలోనే కేబినెట్ ఆమోదానికి పెడతామన్నారు. అనంతరం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదానికి పెట్టనున్నటు చెప్పారు. కాగా పెటర్నీటీ లీవ్ (తండ్రుల పితృత్వ సెలవు )గురించి ఇతర ప్రయోజనాలు గురించి మీడియా ప్రశ్నించినపుడు ఈ బిల్లు తల్లీ బిడ్డలకు సంబంధించింది.. పురుషులకు సంబంధించింది కాదని సమాధానం ఇచ్చారు. ఇది మహిళలకు అనుకూలమైన చట్టంమహిళా సంక్షేమానికి, సాధికారితకు ఉపయోగపడే బిల్లని వ్యాఖ్యానించారు. తద్వారా ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుందన్నారు.
మోడల్ దుకాణాలు మరియు సంస్థలు బిల్లు 2016 (ఉపాధి మరియు సర్వీస్ నిబంధనల క్రమబధ్దీకరణ), బుధవారం కేబినెట్ ఆమోదించిందని గుర్తు చేసిన కార్మిక మంత్రి చట్టం కూడా మహిళలు రాత్రి వేళల్లో (నైట్ షిప్ట్స్) పని చేయడానికి, తాగునీరు, మరుగుదొడ్డి, సిటింగ్, ప్రథమ చికిత్స మరియు భద్రత వంటి మహిళలకు అన్ని సౌకర్యాలు సదుపాయాలను అనుమతిస్తుందని తెలిపారు. మోడల్ లా చట్టం ప్రకారం 30 నుంచి 50 మంది మహిళలు పనిచేసే చోట క్రెచ్ లాంటి సదుపాయాలు లభించనున్నాయి దత్తాత్రేయ చెప్పారు. కార్మిక శాఖ ప్రతిపాదించిన నమూనా చట్టానికి వారి అవసరాలు ప్రకారం సరిచేసే రాష్ట్రాలకు కల్పించామని దత్తాత్రేయ వెల్లడించారు.