
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి సైద్ధాంతికపరంగా ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకం కాదని బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీ పేర్కొన్నారు. తరచూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ గురు గొల్వాల్కర్‌ను పిలిపించుకుని సమావేశమయ్యేవారని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ‘ఆర్గనైజర్’ అనే వారపత్రిక 70వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వచ్చిన ఓ కథనంలో శాస్త్రిని ‘అంకితభావం కలిగిన కాంగ్రెస్‌వ్యక్తి’ అని కొనియాడారు. ‘నెహ్రూ మాదిరిగా కాకుండా జన్‌సంఘ్, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలపై శాస్త్రికి ఎటువంటి వ్యతిరేకత లేదు. జాతీయ సమస్యలపై గురూజీతో శాస్త్రి తరచూ సమావేశమయ్యేవారు’ అని పేర్కొన్నారు.
ఈ కథనాన్ని అడ్వాణీ స్వీయచరిత్ర ‘మై కంట్రీ మై లైఫ్’ నుంచి తీసుకున్నారు. 1960లో ఆర్గనైజర్‌లో అసిస్టెంట్ ఎడిటర్‌గా అడ్వాణీ చేరారు. ఆ సమయంలో చాలాసార్లు శాస్త్రిని ఆయన కలిసే వారు. ‘ఆయనను కలిసినప్పుడల్లా పెద్ద మనసున్న ప్రధాని అని ఆయనపై మంచి అభిప్రాయం ఏర్పడేది’ అని అడ్వాణీ పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా ధోతీ–కుర్తా ధరించేవాడినని, అయితే జర్నలిస్టుకు ఆ దుస్తులు కాకుండా ప్యాంటు చొక్కా అయితే బాగుంటుందని సహోద్యోగులు ఇచ్చిన సలహా మేరకు తన వస్త్రధారణ కూడా మార్చుకున్నానని అడ్వాణీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment