'లాలూనే లాక్కొని కౌగిలించుకున్నారు'
న్యూఢిల్లీ: 'నితీశ్‌జీ ప్రమాణ స్వీకారోత్సవంలో లాలూ యాదవ్ నాతో కరచాలనం చేశారు. అంతటితో ఆగకుండా నన్ను లాక్కొని ఆలింగనం చేసుకున్నారు. ఈ విషయంలో నేనుగా ఎలాంటి చొరవ తీసుకోలేదు'- ఇది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వివరణ. బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్‌కుమార్ ప్రమాణ స్వీకారం వేడుకలో ఆర్జేడీ అధినేత లాలూ-కేజ్రీవాల్ కౌగిలించుకొని కనిపించడం.. టికప్పులో తుపాన్ లాంటి చిన్న దుమారమే రేపింది. దాణా కుంభకోణంలో శిక్షపడిన కళంకిత నేత లాలూను ఎలా కౌగిలించుకుంటారని సొంత పార్టీ ఆప్ నేతలే కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. ఇతర పార్టీల నేతలూ విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ మండలి సమావేశంలో ఈ అంశంపై కేజ్రీవాల్ మాట్లాడారు. అవినీతి రికార్డు కలిగిన లాలూకు మేం వ్యతిరేకమని, ఈ విషయంలో ఆయనను ఎప్పుడూ వ్యతిరేకిస్తామని కేజ్రీవాల్ చెప్పారు. లాలూ నేతృత్వంలోని ఆర్జేడీతో ఎట్టిపరిస్థితుల్లో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిజానికి తాము వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని, పట్నాలో జరిగింది వారసత్వ రాజకీయమేనని, లాలూ ఇద్దరు తనయులు నితీశ్ కేబినెట్‌లో చోటు సంపాదించారని చెప్పారు. లాలూ చిన్న కొడుకు తేజస్వికి బిహార్ ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే.