
ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో భారీ ఉగ్ర దాడులకు లష్కరే తోయిబా సన్నాహాలు
న్యూఢిల్లీ : పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు భారత్‌లో ఉగ్ర దాడులకు సరికొత్త టార్గెట్స్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ఉగ్ర దాడులకు లష్కరే తోయిబా ఉగ్ర మూకలు సన్నాహాలు చేస్తున్నట్టు నిఘా వర్గాల హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వారణాసిలో భారీ ఉగ్ర దాడికి స్కెచ్ వేస్తున్న లష్కరే ఈ దిశగా ఇక్కడ ఏకంగా శిబిరాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టినట్టు సమాచారం.వారణాసి కేంద్రంగా ఉగ్ర దాడులతో చెలరేగేందుకు అవసరమైన సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు గత కొద్ది నెలలుగా లష్కరే ఉగ్రవాదులు వారణాసి సందర్శించారని, ఈ ప్రాంతంలో బేస్‌ను ఏర్పాటు చేసేందుకు సైతం పరిశీలిస్తున్నారని నిఘా సంస్థలు అధికారులకు సమాచారం అందించాయి. వారణాసిలో విధ్వంసం సృష్టించేందుకు తగిన వెసులుబాటు కోసం మే 7 నుంచి మే 11 మధ్య లష్కరే ఉగ్రవాది ఉమర్ మాద్ని మరో నేపాల్‌కు చెందిన ఉగ్రవాదితో కలిసి ఇక్కడ మకాం వేసినట్టు నిఘా వర్గాలు ప్రస్తావించాయి. వారణాసి ప్రాంతంలో లష్కరేను ఎలా బలోపేతం చేయడంతో పాటు పవిత్ర వారణాసిలో భారీ ఉగ్రదాడికి వారు మేథోమథనం చేశారని నిఘా వర్గాలు అధికారులను అప్రమత్తం చేశాయి.