
జునాగఢ్ : గుజరాత్‌లోని జునాఘడ్ ప్రాంతంలో రోడ్లపై సింహాల గుంపు నిర్భయంగా తిరుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాత్రి సమయంలో ఏడు సింహాలు జునాగఢ్ ప్రాంతంలో తిరుగుతున్న వీడియోనూ చూసి ఏ నిమిషం ఏం జరుగుతుందోనని స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కాగా, జునాగఢ్‌కు సమీపంలో ఉన్న గిర్నార్ వన్యప్రాణుల అభయారణ్యం నుంచి ఈ సింహాల గుంపు వచ్చినట్లు తెలుస్తోంది.
"గిర్నార్ అభయారణ్యం జునాగఢ్‌కు సమీపంలో ఉండడంతో సింహాలు తరచుగా బయటకు వస్తుంటాయి. ఇది ఇక్కడ సాధారణమైన విషయం. రాత్రి వేళలో ఇవి బయటకు వచ్చి రోడ్లమీద సంచరించి తిరిగి అడవికి వెళ్లిపోతాయి తప్ప ఎవరికి హాని కలిగించవు. అటవీశాఖ ప్రతీక్షణం సింహాల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షిస్తుందని' డిప్యూటి ఫారెస్ట్ కన్జర్వేటివ్ అధికారి సునీల్ కుమార్ బెర్వాల్ వెల్లడించారు.
గత నెలలో గిర్ అటవీ ప్రాంతంలో ఒక సింహం గడ్డి తింటున్న వీడియో సోషల్‌మీడియాలో సంచలనం సృష్టించింది. సహజంగానే మాంసాహారులు అయిన సింహాలు ఇలా గడ్డి తినడం ఏంటని వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ ఆ వీడియో చివర్లో అసలు విషయం బయటపడింది. సింహాలు ఎప్పుడైనా కడుపు నొప్పితో బాధ పడినప్పుడు గడ్డిని తిని అంతకుముందు తిన్న పదార్థాలను వ్యర్థ రూపంలో బయటకు పంపుతాయి.