నిత్యం తగలబడుతున్న గ్రామం
ఇంటి ముందు హఠాత్తుగా భూమి నుంచి మంటలు ఎగిసిపడతాయి! నడుస్తుండగానే రోడ్డుపైన గోతులుపడి అగ్నికీలలు చీల్చుకొస్తాయి! ఆ సమయంలో అక్కడున్నవాళ్ల కాళ్లు బొబ్బలెక్కుతాయి.. ఆ మంటల్లో నుంచి పుట్టే టాక్సిక్ వాయువులతో కళ్లు మంటలెత్తుతాయి! ఆరని అగ్నిగుండంలాంటి ఈ వ్యవహారం జార్ఖండ్ లోని ఝరియా గ్రామంలో నిత్యం జరుగుతున్నదే!
దీని వెనుక మాయా మంత్రం ఏమీ లేదు. భగభగమండుతున్న బొగ్గుల కొలిమిపై ఆ గ్రామం ఉంది. అక్కడ భూమి కింద నిత్యం మండుతున్న అపారమైన బొగ్గునిల్వలు ఉన్నాయని అధికారులు ఎప్పుడో గుర్తించారు. అవి మండుతూ అప్పుడప్పుడు తన్నుకొని భూమిపైకి మంటలు విరజిమ్ముతాయని చెప్పారు. అక్కడ నివసించడం క్షేమదాయకం కాదని, ఆ ఊరిని మరో సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని రాజకీయ నేతలు, అధికారులు ఎన్నోసార్లు ఆ ఊరి ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ ఆ దిశగా ఇసుమంతకూడా పని జరగలేదు. ఎన్నికల సమయంలోతప్ప ఆ ఊరి వైపు నాయకులెవరూ కన్నెత్తిచూడరు!
కొన్ని తరాలు అంతరించి పోయినా ఆ గ్రామస్థులు మాత్రం తమంతటతాము ఎక్కడికి వలసపోవడం లేదు. కారణం పేదరికం! కొందరు సమీపంలోని బొగ్గుగనిలో పనిచేస్తే.. మరికొందరు పరిసరాల్లో దొరికే బొగ్గును తట్టల్లో తీసుకెళ్లి సమీప మార్కెట్లో అమ్ముకుంటూ పొట్టనింపుకొంటున్నారు. మరోచోటుకు తరలివెళితే ఎక్కడ తలదాచుకోవాలో, జీవనోపాధికి ఏం చేయాలో వారికి తెలియదు. సురక్షిత ప్రాంతంలో కొత్త గ్రామాన్ని కట్టిస్తామన్న అధికారులు ఆ గ్రామంవైపు రారు! బొగ్గు మంటల నుంచి వెలువడే సల్ఫర్, కార్బన్, టాక్సిక్ వాయువుల వల్ల కంటి జబ్బులతోపాటు, చర్మ వ్యాధులు సంక్రమిస్తున్నాయి. అయినా దీపాలవసరంలేదుగదా! అని ఆ మంటల వద్దే రాత్రిళ్లు గడపడం, అవసరమైనప్పుడు ఆ మంటలతోనే వంట చేసుకోవడం వారికి అలవాటైంది.
ఝరియా గ్రామం కింద కుప్పకూలిపోయిన ఓ బొగ్గుగనిలో 70 చోట్ల నిరంతరం మంటలు చెలరేగుతున్నాయని 1916లోనే అధికారులు గుర్తించారు. కాని వారు కారణాలు వెల్లడించలేదు. సమీపంలోని గనిలో ఓపెనీ క్యాస్టింగ్ సక్రమంగా చేయకపోవడం వల్ల గ్రామం కింద ఓ బొగ్గుగని కూలిపోయిందనే ఆరోపణలు, వాదనలూ ఉన్నాయి. ఆ గ్రామం కింద దాదాపు 150 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, అవి మండిపోయి చల్లారడానికి ఇంకా 3,800 సంవత్సరాలు పట్టవచ్చని ‘ఎర్త్ మేగజైన్’ వెల్లడించింది. అప్పటివరకు ఆ గ్రామాన్ని తరలించకుండా మన నేతలు నిరీక్షిస్తారేమో!