
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ దేశాల నుంచి వచ్చే ముస్లిమేతర పౌరులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును మంగళవారం లోక్‌సభ ఆమోదించింది. ఆ 3 దేశాల్లో వేధింపులు, హింసకు గురై భారత్‌కు వలసొచ్చే హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలకు భారత పౌరసత్వం ఇవ్వాలని ఇందులో ప్రతిపాదించారు. ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు ముఖ్యంగా అసోంలో నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. సభ్యుల ఆందోళనల మధ్యే హోం మంత్రి రాజ్‌నాథ్..పౌరసత్వ(సవరణ) బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఆయా దేశాల్లోని ముస్లిమేతర పౌరులకు భారత్‌లో తప్ప మరోచోట స్థానం దొరకడంలేదని తెలిపారు. వలసొచ్చే పౌరుల భారాన్ని అసోంపైనే మోపమని, దేశమంతా పంచుకుంటుందని పేర్కొన్నారు. ఈ విషయం లో అసోంకు అన్ని విధాలా కేంద్రం సహకరిస్తుందని అన్నారు.
నిశితంగా పరిశీలించిన తరువాత జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వాలు సిఫార్సు చేస్తేనే వారికి పౌరసత్వం కల్పిస్తామని చెప్పారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలన్న విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చడంతో కాంగ్రెస్ వాకౌట్ చేసింది. తాజా బిల్లు ఓటుబ్యాంకు రాజకీయాల వికృత రూపమని తృణమూల్ ఎంపీ సౌగతారాయ్ ఆరోపించారు. పౌరసత్వం పొందేందుకు భారత్‌లో కనీస నివాస కాలాన్ని 12 ఏళ్ల నుంచి ఆరేళ్లకు కుదిస్తూ బిల్లులో ప్రతిపాదించారు. లబ్ధిదారులు దేశం లోని ఏ రాష్ట్రంలోనైనా నివాసం ఏర్పర్చుకోవచ్చు. బిల్లుకు నిరసనగా ఎన్డీయే కూటమి నుంచి అసోం గణపరిషత్ తప్పుకున్న సంగతి తెలిసిందే. సీబీఐ పరిణామాలపై చర్చించాలని విపక్షం పట్టుపట్టడంతో రాజ్యసభ కార్యకలాపాలు మంగళవారం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. రాజ్యసభ కార్యకలాపాల్ని ఒకరోజు పొడిగించారు. దీంతో మంగళవారం ముగియాల్సిన సెషన్ బుధవారం కొనసాగుతుంది.