
ఛండీగఢ్ : అధికారుల నిర్లక్ష్యం ఓ పంజాబీ యువకుడిని కష్టాలపాలు చేస్తోంది. విద్యాపరంగానే కాదు.. వృత్తిపరంగానూ ఎదగకుండా ఆటంకాలు కలగజేస్తోంది. పొరపాటున అతని జన్మదిన తేదీని తప్పువేయటమే అందుకు కారణం.
లూథియానాకు చెందిన హర్‌ప్రీత్ సింగ్ ఫిబ్రవరి 20, 1995లో జన్మించాడు. 2012లో అతను చదువులకు ఫుల్ స్టాప్ పెట్టాడు. తర్వాత పంజాబ్ ఓపెన్ స్కూల్ ద్వారా ఎలాగోలా పదో తరగది పూర్తి చేసిన ఆ యువకుడు.. ఇప్పుడు 12వ తరగతి పరీక్షల కోసం సిద్ధం అయ్యాడు. ఈ క్రమంలో అతను బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు కోసం గతేడాది దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు మాత్రం జనన ధృవీకరణ పత్రంలో ఫిబ్రవరి 30 అని తేదీని చేర్చారు. పైగా అది మ్యానువల్‌గా రాయటం కొసమెరుపు. అది గమనించకుండా సివిల్ సర్జన్, మరో ఇద్దరు ఉన్నతాధికారులు దానిపై సంతకం చేశారు.
ఇక దాని సవరణ కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయిన హర్‌ప్రీత్ చివరకు.. చదువుకు పుల్‌స్టాప్ పెట్టి కెనడా వెళ్లి పనులు చేసుకుంటూ బతుకుదామని నిర్ణయించుకున్నాడు. పాస్‌పోర్టు కోసం కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అవసరం కావటంతో అతని కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి. ఏడాది నుంచి ఎందరిని కలిసి విజ్ఞప్తులు చేస్తున్నా.. ఎవరూ అతన్ని పట్టించుకోవటం లేదంట. దీంతో మీడియా దృష్టికి తన సమస్యను చెప్పుకొని హర్‌ప్రీత్ వాపోయాడు.