
రెండేళ్లయినా దొరల బడ్జెటేనా?
మాజీ ఎంపీలు మధుయాష్కీ, పొన్నం విమర్శ
సాక్షి, న్యూఢిల్లీ: అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా టీఆర్‌ఎస్ ప్రభుత్వ బడ్జెట్ దొరల బడ్జెట్‌లాగే ఉందని, బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం దక్కలేదని మాజీ ఎంపీలు మధుయాష్కీ గౌడ్, పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం ఇక్కడ వారు తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, సాగునీటి పారుదల శాఖలకే అధిక నిధులు కేటాయించారు.
వారు చేపట్టింది వాటర్ గ్రిడ్ కాదు.. అవినీతి గ్రిడ్. రెండు పడకల ఇళ్లకు నిధులేవి? తెలంగాణ అమరవీరులకు గుర్తింపేదీ? ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలే తప్ప.. ప్రజావాణికి చోటులేదు. నిరుద్యోగుల వేదన అరణ్య రోదనగానే మిగిలింది..’ అని మధుయాష్కీ పేర్కొన్నారు. పొన్నం మాట్లాడుతూ ‘చేనేత కార్మికులు, గీతకార్మికులు, ఇతర బడుగు బలహీన వర్గాలకు అంది స్తున్న ఆసరా పెన్షన్లను ఇంటి పన్ను బకాయిల కింద పట్టుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఎన్నికలు ఉన్నాయని ఇంటి పన్నులు మాఫీ చేసిన మీరు, గ్రామీణ ప్రాంతాలను ఎందుకు విస్మరిస్తున్నారు’ అని ప్రశ్నించారు. వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటికీ బడ్జెట్‌లో ఆ వర్గాల ప్రజలకు న్యాయం దక్కలేదన్నారు.