మగువకు రక్షణ కరువు..
నేషనల్ డెస్క్: నిర్భయ లాంటి ఎన్ని కఠిన చట్టాలు చేసినా 2014లోనూ మగువలపై అకృత్యాలకు అడ్డుకట్ట పడలేదు. మహిళలు, విద్యార్థినులు మృగాళ్ల చెరలో చిక్కి విలవిల్లాడారు. నగరాలు, పట్టణాల్లోనే కాదు గ్రామాల్లో సైతం మహిళలకు రక్షణ కరువైంది. జనవరిలో ఢిల్లీలో డెన్మార్క్ పర్యాటకురాలి(51)పై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. హోట ల్‌కు దారి అడిగిన బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడటమే కాక దారుణంగా కొట్టి నగదు అపహరించారు.
ఇదే నెలలో పశ్చిమబెంగాల్‌లోని బీర్బుమ్ జిల్లాలో ఓ గిరిజన మహిళ(20)పై 12 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వేరే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉందని బాధితురాలికి గ్రామస్తులు రూ.50 వేలు జరిమానా విధించారు. ఆ మొత్తాన్ని చెల్లించలేకపోవడంతో ఆమెపై గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారు. మే నెలలో యూపీలోని బుర్ద్వాన్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు(14, 16 ఏళ్లు) చెట్టుకు ఉరివేసుకోవడం సంచలనం సృష్టించింది.
వారిపై అత్యాచారానికి పాల్పడి ఆత్మహత్య చేసుకున్నట్టు సృష్టించారని ఆరోపణలొచ్చాయి. డిసెంబర్‌లో ఢిల్లీలో ఉబర్ కంపెనీ క్యాబ్ డ్రైవర్ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడటం దేశాన్ని నివ్వెరపరిచింది. బెంగళూరు కూడా అత్యాచారాలకు నిలయంగా మారింది. పాఠశాలల్లో చిన్నారులపై వరుస అత్యాచారాలు నగరానికి మచ్చ తెచ్చాయి.