ముంబై: రంగుల పండుగ హోలీ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తీవ్రంగా నెలకొన్న నీటి కొరత కారణంగా హోలీ సందర్భంగా నిర్వహించే రెయిన్ డాన్స్ లకు నీటిని సరఫరా చేసేది లేదని తెగేసి చెప్పింది. అలాగే స్విమ్మింగ్ పూల్స్ కు నీరు అందించకూడదని నిర్ణయించింది. నీటి ఎద్దడిని తట్టుకునేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి అన్ని మున్సిపల్ కార్పొరేషనన్లకు ఆదేశాలు జారీచేయనున్నామని పేర్కొంది.
అయితే ప్రభుత్వ నిర్ణయంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. హిందువుల పవిత్ర పండుగ హోలీ సంబరాలపై 'నీళ్లు' చల్లడం అన్యాయమని కొందరు, మంచి నిర్ణయమని కొందరు వ్యాఖ్యానించారు. మరోవైపు దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.