మహాశ్వేతాదేవి ఇకలేరు
కోల్‌కతా: ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త మహాశ్వేతాదేవి(91) గురువారం మృతి చెందారు. రెండు నెలలుగా పలు అవయవాలు పనిచేయకపోవడం, తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గురువారం సాయంత్రం మరణించినట్లు వైద్యులు తెలిపారు. మహాశ్వేతాదేవి మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అణచివేతను, అన్యాయాన్ని ఎదిరిస్తూ తన రచనల ద్వారా బెంగాలీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహా రచయిత్రి మృతి తననెంతో ఆవేదనకు గురి చేసిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. శ్వేతాదేవి మృతికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.
పూర్తి ప్రభుత్వ గౌరవ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తామని మమత ప్రకటించారు. గిరిజనులు, పేద గ్రామీణుల అభివృద్ధి కోసం శ్వేతాదేవి కొన్ని సంఘాలను ఏర్పాటుచేసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. బడుగుబలహీన వర్గాల హక్కుల కోసం పోరాడడానికి ఆమె సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకున్నారు. చిన్న కథలు, నవలల ద్వారా అట్టడుగు వర్గాల స్వరాన్ని వినిపించేవారు. సామాజిక కార్యకర్తగా ఆమె చేసిన రచనలకుగాను పద్మ విభూషణ్, మెగసెసె, జ్ఞానపీఠ్ అవార్డులను పొందారు. హజర్ చురషిర్ మా(మదర్ ఆఫ్ 1084), అరిన్యిర్ అధికార్(రైట్ ఆఫ్ ది ఫారెస్ట్), ఝాన్సీ రాణి(ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ), అగ్నిగర్భ(ది ఫైర్ విత్‌ఇన్), రుదలి, సిధు కన్హూర్ డాకీ తదితర రచనలు పీడిత వర్గాల్లో ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తాయి.
నవలలు, చిన్న కథలు రాయడం కోసం ఆమె బిహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్‌లోని అనేక గిరిజన ప్రాంతాలను సందర్శించారు. ఈమె రచనలు కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి. ప్రముఖ రచయిత్రిగా ఎంతో కీర్తిప్రతిష్టలు పొందిన ఆమె ఎంతో నిరాడంబరంగా జీవించారు. 1926లో మధ్యతరగతి కుటుంబంలో ఢాకాలో ఆమె జన్మించారు. తండ్రి మనీష్ కటక్ ఆ సమయంలో ప్రఖ్యాత కవి. రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన శాంతినికేతిన్ విశ్వవిద్యాలయంలో చదువు పూర్తిచేసుకున్న శ్వేతాదేవి.. ప్రముఖ నాటక రచయిత బిజోన్ భట్టాచార్యను వివాహం చేసుకున్నారు. తర్వాత కొద్ది రోజులకు వీరు విడాకులు తీసుకున్నారు. 2014లో చనిపోయిన ఈమె కుమారుడు నబరున్ కూడా ప్రఖ్యాత కవి, రచయిత. ఈయన సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందారు.
ఆత్మకథ పూర్తి చేయలేకపోయారు: మహాశ్వేతాదేవి తన ఆత్మకథను పూర్తి చేయలేకపోయారని ఆమె సన్నిహితుడు జోషీ జోసెఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. 2007లో నందిగ్రామ్ హింసాత్మక ఘటనల అనంతరం శ్వేతాదేవి ఆత్మకథ రాయడం ప్రారంభించారని, అయితే, ఇల్లు మారుస్తున్న సమయంలో ఆ డైరీ మాయమైందన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: మహాశ్వేతాదేవి మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశం గర్వించదగిన మహోన్నత రచయిత్రిగా ఆమెకు చరిత్రలో స్థానం ఉందన్నారు.
వైఎస్ జగన్ సంతాపం
ప్రఖ్యాత రచయిత్రి మహాశ్వేతాదేవి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. భార త సాహితీ రంగానికి ఆమె మృతి ఎప్పటికీ తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు. మహాశ్వేతాదేవి తన పరిజ్ఞానంతో ఎందరో రచయితలకు, మేధావులకు స్ఫూర్తినిచ్చారని కొనియాడారు.