హమీర్‌పూర్ : కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసరాలు తప్పిస్తే వివాహ, ఇతరత్రా కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. అయితే కొందరు తమ వివాహాలను వాయిదా వేసుకోవడం ఇష్టం లేక ఎంతదూరమైనా వెళుతున్నారు. కొందరు తమ కుటుంబసభ్యులు సమక్షంలో జరుపుకుంటుంటుండగా, మరికొందరు ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌కు చెందిన కల్కు ప్రజాపతి పెళ్లి కోసమని మొదట 100 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం చేశాడు. పెళ్లి చేసుకొని తిరిగి అదే సైకిల్‌పై తన భార్యను ఎక్కించుకొని మరో 130 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. మొత్తం 230 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి ఎట్టకేలకు తన సొంతూరుకు చేరుకున్నాడు. (ఆరోగ్యం బాలేదని అంబులెన్స్‌కు కాల్ చేసి..)
వివరాలు.. హమీర్‌పూర్‌కు చెందిన కల్కు ప్రజాపతి పదో తరగతి వరకు చదువుకున్నాడు. మహోబా జిల్లా పునియా గ్రామానికి చెందిన వధువు రింకుతో పెళ్లి ఏప్రిల్ 25వ తేదీన జరగాల్సి ఉంది. తన పెళ్లికి సంబంధించి అనుమతి కోసం లోకల్ పోలీసులను ఆశ్రయించగా వారు నిరాకరించారు. దీంతో చేసేదేంలేక ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించిన ప్రజాపతి సైకిల్‌పై వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్న సమయానికి పెళ్లి జరగడంతో ప్రస్తుతం ప్రజాపతి సంతోషంగా ఉన్నాడు. అయితే తన ప్రయాణంలో పడిన కష్టాలను స్వయంగా చెప్పుకొచ్చాడు.
' నా వివాహం నాలుగు నెలల క్రితమే రింకూ అనే వధువుతో నిశ్చయించారు. అయితే వధువు కుటుంబం 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహోబా జిల్లా పునియా గ్రామంలో ఉంటున్నారు. అప్పటికే వధువు రింకూ కుటుంబం పెండ్లి పత్రికలు కూడా ముద్రించి అందరికి పంపిణీ చేశారు. ఇంతలో కరోనా వల్ల లాక్‌డౌన్ విధించారు. పెళ్లి కోసం నెలరోజులకు పైగా పొలం పనులు విడిచిపెట్టి అనుమతి కోసం పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగాను. కాని నాకు పోలీసుల నుంచి అనుమతి రాలేదు. ఇంతలో పెండ్లి తేదీ దగ్గరకు వస్తుందనే ఆందోళన ఎక్కువైంది. దీనికి తోడు నాకోసం వధువు కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఎక్కడికి వెళ్లే అవకాశం లేకపోవడంతో సైకిల్‌పై బయలుదేరాను. వాస్తవానికి నాకు ద్విచక్రవాహనం నడపడం వచ్చు కాని లైసెన్స్ లేదు. సైకిల్‌పై వెళితే లైసెన్స్ అవసరం ఉండదని భావించి ప్రయాణం ప్రారంభించాను. చివరకు ఎన్నో కష్టాలు పడి వధువు ఇంటికి చేరుకున్నాను. (పెళ్లి కోసం 800 కిలోమీటర్ల ప్రయాణం.. చివరికి)
మా వివాహానికి అందరిని ఆహ్వానించాం. లాక్‌డౌన్ కారణంగా బంధువుల ఎవరూ మా పెళ్లికి రాలేకపోయారు. వధువు కుటుంబ సభ్యుల మధ్య గుడిలో వివాహ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. నేను వెళ్లేటప్పుడు ఒంటరిగానే వెళ్లాను. అయితే తిరుగు ప్రయాణంలో మాత్రం రింకూ కూడా ఉండటంతో సైకిల్ తొక్కడం ఇబ్బందిగా మారింది. దాదాపు 230 కిలోమీటర్లు ప్రయాణించి ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నాం. ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. కాళ్లు నొప్పులు పుట్టి నిద్రకూడా సరిగా పట్టలేదు.. నొప్పులు తగ్గడానికి మందులు వాడాల్సి వచ్చింది. బంధువులు వివాహానికి హాజరుకాలేక పోయినా అందరూ ఫోన్లు చేసి ఆశీర్వదించారు. పెండ్లి వాయిదా వేయాలని చాలా మంది సలహా ఇచ్చారు. కాని తన తల్లి ఆనారోగ్యంతో ఉండటం,ఇంట్లో వంట చేయడానికి ఎవరూ లేకపోవడం వల్ల తప్పని సరిగా ఇప్పడే వివాహం చేసుకోవాల్సి వచ్చింది. అంతేగాక లాక్‌డౌన్ ఎత్తివేయడానికి ఎంతసమయం పడుతుందో తెలియదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు' ప్రజాపతి చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment