గాంధీ బొమ్మను మరిచిపోయారట!
భోపాల్: నిత్యవసర సరుకుల కొనేందుకు డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎం కేంద్రానికి వెళ్లిన వ్యక్తికి కొత్త 500 రూపాయల నోట్లు నకిలీవి రావడంతో షాక్ తిన్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని మోరేనాలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుడు గోవర్ధన్ శర్మ నేటి ఉదయం డబ్బులు డ్రా చేసుకునేందుకు మోరెనాలోని ఏ ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. డబ్బు డ్రా చేసిన తర్వాత షాక్ తినడం అతడి వంతయింది. ఏటీఎం నుంచి వచ్చిన రూ.500 నోట్లపై మహాత్మాగాంధీ బొమ్మ ముద్రించి లేకపోవడంతో నకిలీ నోట్లు అని గుర్తించి తాను మోసపోయానని గ్రహించాడు.
ఏటీఎం సెంటర్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డుకు తాను డ్రా చేసిన నోట్లను చూపించి అసలు విషయాన్ని చెప్పాడు. అతడు ఏటీఎంలో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేశాడు. వెంటనే ఎస్‌బీఐ అధికారులు కొందరు ఏటీఎం వద్దకు వచ్చి నోట్లను పరిశీలించారు. అవి నకిలీ నోట్లు కాదని, అయితే ఆ నోట్లపై గాంధీజీ బొమ్మను ముద్రించడం మరిచిపోయారని వివరణ ఇచ్చుకున్నారు. ఆ నోట్లను తిరిగి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు పంపిస్తామని ఆ ఎస్‌బీఐ ఉద్యోగి వివరించారు.
పెద్ద నోట్లరద్దు చేసిన ఐదు నెలల తర్వాత కూడా దేశవ్యాప్తంగా పలు నగరాలలో ఏటీఎం కేంద్రాలు ఖాళీగా దర్శనమిస్తుండగా.. మరోవైపు పదే పదే ఎస్‌బీఐ ఏటీఎంలలో ఇలా నకిలీ నోట్లు వస్తుండటంతో జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో సౌత్ ఢిల్లీ అమర్ కాలనీ ప్రాంతంలోని ఒక ప్రైవేటు బ్యాంకు ఏటీఎంలో నకిలీ రూ.2 వేల నోట్లు దర్శనమిచ్చాయి. అంతకుముందు ఢిల్లీలోని మరో ఏటీఎం నుంచి ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసినపుడు చిల్డ్రన్ బ్యాంకు ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నకిలీ నోటు కనిపించడంతో వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోనూ షాజహాన్‌పూర్‌లో పలు ఏటీఎం కేంద్రాల నుంచి రూ. 2000 నోట్లు నకిలీవి కలకలం రేపిన విషయం తెలిసిందే.