మీడియా ముందుకు వచ్చిన రాహుల్ ఉపాధ్యాయ్
లక్నో: ఉత్తరప్రదేశ్ కాస్‌గంజ్‌లో మతఘర్షణలు తీవ్రరూపం దాల్చడానికి ప్రధాన కారణం.. రాహుల్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి మృతి చెందాడని వదంతులు చెలరేగడమే.. నిజానికి రాహుల్ ఉపాధ్యాయ్ మరణించలేదు. ఆ విషయాన్ని పోలీసులు సోమవారం స్పష్టం చేశారు. మంగళవారం రాహుల్ ఉపాధ్యాయ్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి.. తాను చనిపోలేదని స్పష్టత ఇచ్చాడు.
‘కాస్‌గంజ్ అల్లర్లలో నేను చనిపోయినట్టు సోషల్ మీడియాలో వదంతులు చెలరేగుతున్నట్టు నా స్నేహితుడు ఒకరు తెలిపారు. కానీ, అల్లర్లు జరిగిన సమయంలో నేను కాస్‌గంజ్‌లో లేను. నేను ఊరికి వెళ్లాను. నేను బాగున్నాను’ అని రాహుల్ వివరించాడు. రాహుల్ మృతి చెందాడని వదంతులు వ్యాప్తి చేస్తూ.. మతఘర్షణలను మరింత రెచ్చగొట్టాలని చూస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్టు అలీగఢ్ రేంజ్ ఐజీ సంజీవ్ గుప్తా తెలిపారు.
గణతంత్ర దినోత్సవం నాడు ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో చందన్ గుప్తాతోపాటు రాహుల్ ఉపాధ్యాయ్ కూడా చనిపోయాడని తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొట్టాయి. రాహుల్ మృతి చెందాడన్న వదంతులను నమ్మిన మూక.. గత మూడురోజులుగా హింసకు దిగుతోంది.
గణతంత్ర దినోత్సవం నాడు చేపట్టిన ‘తిరంగ యాత్ర’ ఉద్రిక్తతలకు దారితీసి.. ఒకరి మృతికి, ఇద్దరు గాయపడటానికి కారణమైంది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 51మందిపై అభియోగాలు నమోదుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment