‘ఆ వ్యక్తి జీవితాంతం గుర్తుంటాడు కదా’ | Maneka Gandhi Wants No Time Limit For Harassment Cases | Sakshi
Sakshi News home page

మీటూ; ‘ఆ వ్యక్తి జీవితాంతం గుర్తుంటాడు కదా’

Published Mon, Oct 8 2018 4:52 PM | Last Updated on Mon, Oct 8 2018 7:51 PM

Maneka Gandhi Wants No Time Limit For Harassment Cases - Sakshi

హాలీవుడ్‌ సినీ దిగ్గజం హార్వీ వీన్‌స్టీన్‌ బాగోతం బట్టబయలైన నాటి నుంచి పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులపై మహిళలు ధైర్యంగా గళం విప్పుతున్నారు. సెలబ్రిటీలు మొదలు ప్రతీ ఒక్కరూ ‘మీటూ’  అంటూ తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటి తనుశ్రీ.. ప్రముఖ నటుడు నానా పటేకర్‌ నుంచి వేధింపుల గురించి నోరు విప్పడంతో భారత్‌లోనూ మీటూ ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది. నాణేనికి రెండు వైపులు ఉన్నట్లుగానే కొంతమంది తనుశ్రీకి మద్దతుగా నిలుస్తుంటే.. మరికొంత మంది మాత్రం అవన్నీ అవాస్తవాలంటూ ఆమెను వ్యతిరేకిస్తున్నారు. అంతటితో ఆగకుండా పదేళ్ల క్రితం జరిగిన విషయాన్ని ఇప్పుడు బయటపెట్టడం ఎందుకు, పబ్లిసిటీ కోసమే ఆమె ఇలా చేస్తున్నారంటూ నిందిస్తున్నారు కూడా. ఇవన్నీ కొంతమంది అభిప్రాయాలు మాత్రమే.

కేవలం నిబంధనల కారణంగానే..!
ఇవన్నీ కాసేపు పక్కన పెడితే...‘ 2008లో తనుశ్రీ చేసిన ఫిర్యాదును సక్రమంగా పరిష్కరించలేకపోయామని చెప్పడానికి చింతిస్తున్నాం. అప్పటి చీఫ్‌ గ్రీవెన్స్‌ ఆఫ్‌ సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ విభాగం ఈ ఇష్యూను సమావేశంలో ప్రస్తావించలేదు. అప్పటితో పోలిస్తే ఇప్పటి విధుల్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఆమెకు మా క్షమాపణలు సరిపోవు. కానీ నిబంధనల ప్రకారం మూడేళ్ల క్రితం నాటి కేసులు అసోషియేషన్‌ పరిగణించదు సినీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(సింటా) ఓ ప్రెస్‌ నోట్‌ విడుదల చేసినట్లు వార్తలు వచ్చాయి.

కఠినంగా శిక్షిస్తాం!
ఈ క్రమంలో తనుశ్రీకి మద్దతుగా నిలిచిన కేం‍ద్ర మంత్రి మేనకా గాంధీ.. వృత్తి ఉద్యోగాల్లో మహిళలపై జరిగే ఏ చిన్న వేధింపుల వ్యవహారన్నైనా సహించేది లేదని స్పష్టం చేశారు. భారత్‌లో కూడా ‘మీటూ’ తరహా ఉద్యమం రావాలని ఆకాక్షించారు. అయితే గత కొన్ని రోజులుగా మీటూ ఉద్యమం ఉధృతమవుతున్న నేపథ్యంలో... ఘటన జరిగిన మూడేళ్లలోపే ఫిర్యాదు చేయాలనే నిబంధన కారణంగా చాలా మందికి ఫిర్యాదు చేసే అవకాశం లభించడం లేదు. ఈ విషయంపై స్పందించిన మేనకా గాంధీ... పని ప్రదేశాల్లో వేధింపులు ఎదుర్కొన్న మహిళలు.. ఘటన జరిగిన పది నుంచి పదిహేనేళ్ల తర్వాత కూడా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు నిబంధనలు సవరించే విధంగా న్యాయశాఖకు లేఖ రాశామని తెలిపారు.

ఆమె ఇంకా ఏమన్నారంటే..
‘మిమ్మల్ని వేధించిన వ్యక్తి ఎవరో జీవితకాలం గుర్తు ఉంటాడు కదా. అందుకే ఫిర్యాదు చేసే విషయంలో నిబంధనలు సరిచేయాలంటూ న్యాయశాఖకు లేఖ రాశాం. వేధింపులు ఎదురైన పదేళ్ల తర్వాత కూడా మీ ఫిర్యాదు స్వీకరిస్తారు. కాలం గడుస్తున్నంత మాత్రాన ఆ చేదు అనుభవాల తాలూకు ఙ్ఞాపకాలు చెరిగిపోవు. అందుకే ఇకపై ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చని’  మేనకా గాంధీ స్పష్టం చేశారు. అలాగే మీటూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడం ఎంతో సంతోషంగా ఉందని, బాధితులు తమ బాధను పంచుకోవడానికి ఏమాత్రం వెనుకాడకూడదని పిలుపునిచ్చారు. అయితే ఈ క్రమంలో ఉద్యమం పట్టు తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించారు.

కాగా మహిళల సంఖ్యకు అనుగుణంగా ప్రతీ సంస్థలోనూ ఫిర్యాదులను స్వీకరించేందుకు సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ విభాగం ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. అలాగే వేధింపులు ఎదుర్కొన్న విషయాన్ని మూడేళ్ల లోపు సెల్‌ దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అలాగే బాల్యంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటే 18 ఏళ్ల వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరిమితిని 30 ఏళ్లకు పెంచాల్సి ఉందని మేనకా గాంధీ అభిప్రాయపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement