అమ్మ హయాంలోనే ఆ రంగాల అభివృద్ధి కూడా..
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత చేపట్టిన అభివృద్ధి పథకాలు ఏమిటంటే అమ్మ క్యాంటీన్, అమ్మ మందులు, అమ్మ ఉప్పు, అమ్మ పప్పు, అమ్మ టీవీలు అంటూ ప్రజాకర్షక పథకాల పేర్లను అనర్గళంగా చెప్పేస్తారు. అది ఒక పార్శం మాత్రమే. ఆరోగ్య, పారిశ్రామిక, సామాజిక, విద్యా రంగాల్లో, నేరాలను అరికట్టడంలో ఆమె ఎంతో పురోభివృద్ధి సాధించారు. దేశంలోకెల్లానే కాకుండా ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, బెల్జీయం దేశాలకన్నా శిశు మరణాలు తమిళనాడులోనే తక్కువంటే ఆశ్చర్యం వేస్తోంది.
మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు కూడా దేశంలోకెల్లా తమిళనాడులోనే తక్కువ. జయలలిత హయాంలో తమిళనాడులో పారిశ్రామికాభివృద్ధి పెరిగి ఎన్నో కొత్త ఫ్యాక్టరీలు వచ్చాయని, ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయని, ఆమె అధికారంలోవున్న 15 ఏళ్లలోనే విద్యారంగం కూడా ఎంతో పురోభివృద్ధి చెందిందని ‘ఇండియాస్పెండ్’ సంస్థ డేటా విశ్లేషనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆమె చేపట్టిన ఉచిత జనరంజక పథకాల వల్ల 2015, డిసెంబర్ 31నాటికి గడచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రం అప్పులు 92శాతం పెరిగాయి. విద్యారంగ పురోభివృద్ధి సూచికలు జాతీయ సరాసరి కన్నా ఎప్పుడూ తమిళనాడులో ఎక్కువగానే ఉన్పప్పటికీ ఆమె 15 ఏళ్ల పరిపాలన కాలంలో కూడా చెప్పుకోతగ్గ అభివృద్ధి జరిగింది.
భారత్ లోని ఏ రాష్ట్రంలో లేనన్ని ఫ్యాక్టరీలు ఒక్క తమిళనాడు రాష్ట్రంలో ఉండడం మరో విశేషం. 2013-2014లో విడుదల చేసిన పారిశ్రామిక వార్షిక సర్వే ప్రకారం 37,378 ఫ్యాక్టరీలు ఉన్నాయి. రెండో స్థానాన్ని ఆక్రమించిన మహారాష్ట్రలో 29,123 ఫ్యాక్టరీలు ఉన్నాయి. 22,876 ఫ్యాక్టరీలతో గుజరాత్ మూడవ స్థానంలో ఉంది. అత్యధికంగా కార్మికులు, అంటే 24లక్షల మంది తమిళనాడులో పనిచేస్తున్నారు. ఆ తర్వాత మహారాష్ట్రలో 18 లక్షల మంది, గుజరాత్‌లో 13 లక్షల మంది పనిచేస్తున్నారు. దేశంలో సరాసరి సగటు ఆదాయం ఎక్కువున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఐదవ స్థానాన్ని ఆక్రమించింది.
జనాకర్షక ఉచిత పథకాలు..
ప్రజల సంక్షేమం కోసం ఉచిత పథకాలను తమిళనాడులో ప్రవేశపెట్టడం జయలలిత ద్వారానే ప్రారంభంకాలేదుగానీ ఆమె హయాంలో విస్తృతం అయ్యాయి. 2011లో ఎన్నికల సందర్భంగా ఆమె ప్రతి ఇంటికి వంద యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తానని, ప్రతి 11,12 తరగతి విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ ట్యాప్లను ఇస్తానని, ప్రతి పెళ్లికి గ్రాము బంగారం ఉచితమని, దారిద్య్ర రేఖకు దిగువనున్న ప్రతి కుటుంబానికి నాలుగు మేకలు లేదా గొర్రెలు ఇస్తానని హామీ ఇచ్చారు.
ఇక అమ్మ క్యాంటీన్, అమ్మ మెడికల్స్ గురించి చెప్పక్కర్లేదు. వీటన్నింటిని అమలు చేయడం ద్వారా తమిళనాడు రాష్ట్రం అప్పులు అతివేగంగా అంటే 92శాతం ఈ ఐదేళ్లకాలంలో పెరిగాయి. అయితే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 20 శాతం మాత్రమే ఉన్నాయి. అంటే అప్పులను అధిగమించే స్థాయిలో రాష్ట్రం పురోభివృద్ధి కొనసాగుతోంది. ఈ అప్పుల శాతం 50 శాతానికి పెరిగే వరకు తమిళనాడుకు వచ్చే నష్టమేమీ లేదు.