
నోట్లు మార్చాలని వృద్ధులపై నక్సల్స్ ఒత్తిడి
జార్ఖండ్: జార్ఖండ్‌లోని నక్సల్స్ తమ వద్ద ఉన్న పాత రూ. 500, రూ. 1,000 నోట్లను మార్పిడి చేయాలంటూ వృద్ధులను బలవంతపెడుతున్నట్లు తేలింది. నక్సల్స్ ప్రభావిత లతేహర్ జిల్లాలో కోట్లాది రూపారుుల నల్లధనాన్ని.. ప్రభుత్వ నిబంధనల మేరకు రూ. 2.5 లక్షల చొప్పున తమ అకౌంట్లలో జమ చేయాలంటూ వృద్ధులపై నక్సలైట్లు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయాన్ని లాతేహర్ ఎస్పీ అనూప్ బిర్తరే ధ్రువీకరించారు.
పాత నోట్లను మార్చుకునేందుకు నక్సలైట్లు గ్రామస్తులను వాడుకుంటున్నారని వెల్లడించారు. ఈ వ్యవహారంలో వృద్ధులే కాక, యువకుల పాత్ర కూడా ఉందని స్పష్టం చేశారు. గత రెండు రోజులుగా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. కొందరు నక్సల్స్ సానుభూతిపరులు ఈ నోట్ల మార్పిడి వెనుక ఉన్నట్లు పేర్కొన్నారు.