
వేడియారం
మన శరీరం ఎల్లప్పుడూ వెచ్చగా ఉంటుందని అందరికీ తెలుసు. ఎలాంటి పని లేకుండా ఉన్నప్పుడు ఈ వేడితో ఓ బల్బును వెలిగించవచ్చునట. వ్యాయామం చేసేటప్పుడు పుట్టే వేడిలో మాత్రం ఈ విద్యుత్తు ఓ కిలోవాట్ వరకూ ఉంటుందని అంచనా. ఇప్పుడీ వేడి... విద్యుత్తు సంవాదం ఎందుకయ్యా అంటే... పక్కనున్న ఫొటో చూడండి. ఈ వాచీకి బ్యాటరీ అన్నది అస్సలు అవసరం లేదు. మన శరీరంలోని వేడితోనే పనిచేస్తుంది. మ్యాట్రిక్స్ పవర్ వాచ్ కంపెనీ ఐదేళ్ల శ్రమ ఫలితంగా రూపుదిద్దుకున్న ఈ సూపర్ స్మార్ట్‌వాచ్ రోజువారీ వ్యాయామం లెక్కలేయడంతోపాటు ఎంత విద్యుత్తు ఉత్పత్తి చేయగలిగేంత వేడి పుట్టించారో కూడా చెబుతుంది.
యాభై మీటర్ల లోతు నీళ్లల్లో వేసినా చెక్కుచెదరని ఈ వాచ్ నుంచి ఆండ్రాయిడ్ ఓఎస్‌కు, అక్కడి నుంచి క్లౌడ్‌కు సమాచారాన్ని పంపించే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. మరి... ఈ వాచీ నడవాలంటే ఎప్పుడూ కట్టుకునే ఉండాలా? అవసరం లేదు. తీసేయగానే ఇది స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. అతితక్కువ కరెంటుతో పనిచేస్తూ ఉంటుంది. ఇప్పటికే ఇండిగోగో ద్వారా కేవలం రెండు నెలల్లోనే దాదాపు లక్ష డాలర్ల పెట్టుబడులు సేకరించిన మ్యాట్రిక్స్ పవర్‌వాచ్ కంపెనీ వచ్చే ఏడాది జూలై నుంచి వీటిని అందరికీ అందుబాటులోకి తేనుంది. ధర దాదాపు రూ.9 వేల వరకూ ఉండవచ్చు.