
మూడు టైర్ల టూ వీలర్
సాక్షి నాలెడ్జ్ సెంటర్
విద్యుత్తుతో నడిచే వాహనాల గురించి మనం చాలాసార్లు ముచ్చటించుకున్నాం. ఫోల్డ్ చేసుకునే బుల్లి బైకుల నుంచి పడవంత కార్లు కూడా ఇప్పుడు విద్యుత్తుతో నడుస్తున్నాయి. ఇందులో ఏమీ విశేషం లేదుగానీ.. ఈ ఫొటోను పరిశీలనగా గమనిస్తే విషయం మీకే అర్థమవుతుంది. అవునండి... ఈ మోటా ర్‌సైకిల్ రెండు చక్రాల బండి కాదు. మూడు చక్రాలబండి. ఇదొక్కటే దీని విశేషం కాదులెండి. ఇంకా చాలా ఉన్నాయి. అమెరికాలోని వెస్ట్ వర్జీనియా ప్రాంతంలో ఉండే జెడ్‌ఈవీ అనే చిన్న కంపెనీ వీటిని తయారు చేస్తోంది. ఇప్పటివరకూ చాలా మోడళ్ల ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను తయారు చేసిన ఈ సంస్థ తాజాగా ముందువైపున రెండు, వెనుకవైపు ఒక చక్రం ఉండే ఎల్‌ఆర్‌సీ – టీ 15ని సిద్ధం చేసింది. ఎల్‌ఆర్‌సీ టీ–15 అని పిలుస్తున్న ఈ మోటార్ బైక్ 15 కిలోవాట్ల బ్యాటరీలతో పనిచేస్తుంది.
ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలగడం దీని ప్రత్యేకత. అది కూడా గంటకు 88 కిలోమీటర్ల వేగంతో! బీఎండబ్ల్యూ లాంటి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కంపెనీ అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ దాదాపు ఇంత సామర్థ్యమున్న బ్యాటరీని వాడుతున్నప్పటికీ కేవలం 160 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించగలగడం విశేషం. పైగా ఎల్‌ఆర్‌సీ టీ–15 మోటార్.. బాడీలో కాకుండా చక్రంలోనే ఏర్పాటు అవడం మరో విశేషం. మూడు చక్రాలు ఉండటం వల్ల రోడ్డుపై ఇది చాలా స్థిరంగా ఉంటుంది. వంపులు వచ్చినప్పుడు ముందువైపున ఉన్న రెండు చక్రాలు వంపునకు తగ్గట్టుగా పైకి కిందకు కదులుతాయి. పదేళ్ల క్రితం పియాజియో కూడా ఇలాంటి బైక్‌ను సిద్ధం చేసినప్పటికీ అది మార్కెట్ ఆదరణ చూరగొనలేదు. తాజాగా జెడ్‌ఈవీ సిద్ధం చేసిన ఈ సరికొత్త బైక్‌కు ఏమాత్రం ఆదరణ లభిస్తుందో చూడాలి. రేటెంతో చెప్పలేదు కదూ... దాదాçపు 20 వేల డాలర్లు. రూపాయల్లో చెప్పాలంటే దాదాపు 14 లక్షలు!