'చెల్లని' కాంగ్రెస్ ఓట్లు.. మీడియా కింగ్ విజయం
మీడియా కింగ్ సుభాష్ చంద్ర అనూహ్యంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన హరియాణా నుంచి పెద్దల సభకు ఎన్నికయ్యారు. బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన జీ గ్రూపు అధినేత.. పెద్ద రాజకీయ డ్రామా నడుమ ఎన్నిక కావడం గమనార్హం. ఈయనపై ఐఎన్ఎల్‌డీ మద్దతుతో ఢిల్లీకి చెందిన ప్రముఖ న్యాయవాది ఆర్కే ఆనంద్ పోటీ చేశారు. అయితే.. 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేసిన ఓట్లు చెల్లలేదు. దాంతో ఆనంద్ ఓడిపోగా, సుభాష్ చంద్ర గెలిచారు. నిజానికి రాజ్యసభ ఎన్నికలలో ఓట్లు వేసేది అప్పటికే ఎమ్మెల్యేలుగా గెలిచినవాళ్లు. వాళ్లకు ఓటు ఎలా వేయాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అయినా వారు వేసిన ఓట్లు చెల్లలేదంటే.. అందులో ఏదో మతలబు ఉందనే అంటున్నారు.
విప్‌ను ధిక్కరించి వేరే పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే, పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం ప్రకారం వేటు పడే ప్రమాదం ఉంటుంది. అప్పుడు సభ్యత్వాన్ని కోల్పోవాలి. మరోసారి ఎన్నిక అవుతామో లేదో నమ్మకం ఉండదు. కానీ అవతలి వాళ్లు మనకు బాగా కావల్సిన వాళ్లయితే.. వాళ్లు గెలవాలని గట్టిగా కోరుకుంటే.. మన ఓట్లు చెల్లకుండా ఉండేలా వేయొచ్చు. అప్పుడు అవతలి వాళ్లకు అంత బలం లేకపోయినా, ఈ ఓట్లు చెల్లవు కాబట్టి తొలి ప్రాధాన్యత ఓట్లలోనే ఆ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది. సుభాష్ చంద్ర విజయం వెనుక ఇలాంటి వ్యూహమే పనిచేసిందని సమాచారం.