
మీరట్ : ఉత్తర ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలిని, ఆమె కొడుకును కొందరు దుండగులు కిరాతకంగా కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మొత్తం సీసీ ఫుటేజీలో నిక్షిప్తం కాగా, ప్రస్తుతం ఆ వీడియో మీడియా ఛానెళ్లలో చక్కర్లు కొడుతోంది.
వివరాల్లోకి వెళ్లితే... ప్రతాప్‌పూర్ శివార‍్లలోని సోర్ఖా గ్రామంలో నిచాట్టర్ కౌర్ అనే వృద్ధురాలు, తన కొడుకు బల్విందర్‌తో నివసిస్తోంది. బుధవారం ఉదయం కొందరు వ్యక్తులు తుపాకులతో వారుంటున్న ఇంటికొచ్చారు. ఆ సమయంలో బయటే ఉన్న బల్విందర్‌ను వారు కాల్చి చంపారు. అటుపై కాస్త ముందుకు వెళ్లగానే ఆరు బయట మంచంపై నిచాట్టర్ వారికి కనిపించింది. దీంతో కాల్పులకు తెగబడ్డారు.
ఆ సమయంలో పక్కనే ఉన్న మరో వృద్ధురాలిని వారు బెదిరించటంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత నిచాట్టర్ పై మరిన్ని రౌండ్ల కాల్పులు జరిపారు. మంచంపై రక్తపు మడుగుతో ఆ వృద్ధురాలు అలాగే కుప్పకూలిపోయింది. అయితే ఆమెను చంపిన దృశ్యాలు అక‍్కడే ఉన్న సీసీ ఫుటేజీలో నమోదు కాగా.. ఆ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలతోనే ఈ హత్యలు జరిగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.
గ్రామస్థుల కథనం... నిచాట్టర్ భర్త నరేంద్రను 2016 సంవత్సరంలో కొందరు ఆగంతకులు చంపేశారు. అందుకు నిచాట్టర్, ఆమె కొడుకు బల్విందర్‌లే సాక్ష్యం. ఈ కేసులో మాలే, మంగు మరికొందరు దోషులుగా తేలారు. మంగూ ఇప్పటికే శిక్షను అనుభవిస్తుండగా.. మిగతా వాళ్లు పరారీలో ఉన్నారు. కాగా, ఘటనకు కొద్దిరోజుల ముందే వీరిని చంపేస్తామని గ్రామస్థుల సమక్షంలోనే నిందితులు ప్రకటించారంట. దీంతో నరేంద్ర హత్య కేసు నిందితులే ఈ పని చేయించి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు. భయానకంగా ఉన్న ఈ సీసీ ఫుటేజీ దృశ్యాలు మీ కోసం...