కార్డు చెల్లింపులపై అదనపు వడ్డన!
కార్డు చెల్లింపులపై అదనపు వడ్డన!
Published Wed, Dec 7 2016 9:11 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
నగదురహిత వ్యవస్థ దిశగా దేశాన్ని తీసుకెళ్లాలని పెద్దనోట్లు రద్దుచేసి, స్వైపింగ్ మిషన్ల సంఖ్య పెంచుతున్నా.. సామాన్యులకు మాత్రం దాని ఫలితాలు సరిగా అందడం లేదు. ఆన్‌లైన్ సర్వర్ల మీద భారం ఒక్కసారిగా పెరిగిపోవడంతో లావాదేవీలు అన్నీ నత్తనడకన సాగుతున్నాయి. కొన్నిసార్లు చివరివరకు వెళ్లి పేమెంట్ జరగకపోవడంతో వినియోగదారులకు చికాకు వస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే.. స్వైపింగ్ మిషన్ల సాయంతో కార్డు ద్వారా చెల్లింపులు చేయాలంటే పెద్ద తలనొప్పిగా ఉంది. కనీసం 250 రూపాయలకు కొనుగోలు చేస్తేనే కార్డు చెల్లింపులు తీసుకుంటామని చెప్పడమే కాక, వాటికి అదనంగా 2 శాతం సర్వీసు చార్జి వసూలు చేస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ చార్జీలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించినా, చాలావరకు దుకాణాల వాళ్లు మాత్రం అదనంగా 2 శాతం ఇస్తేనే కార్డు చెల్లింపు తీసుకుంటామని తెగేసి చెబుతున్నారు.
కార్డు ద్వారా లావాదేవీలు చేయాలంటే కార్డును రెండు లేదా మూడుసార్లు స్వైప్ చేయాల్సి వస్తోందని, నవంబర్ మధ్య నుంచే ఈ సమస్య వచ్చిందని ఢిల్లీ సదర్ బజార్‌లోని ఓ హోల్‌సేల్ దుకాణ యజమాని నవీన్ కుమార్ చెప్పారు. ఈయన వ్యాపారం ఎక్కువగా నగదు ఆధారంగానే జరుగుతుంది గానీ, ఇప్పుడు నగదు ఎక్కువ అందుబాటులో లేకపోవడంతో.. ఆయన రూ. 23వేలు ఖర్చుపెట్టి స్వైపింగ్ మిషన్ కొన్నాడు. కానీ అది తరచు మొరాయిస్తోందని, రెస్పాండ్ కావడానికి ఎక్కువ సమయం పడుతోందని వాపోతున్నాడు.
ఈమధ్య కాలంలోనే ఎక్కువ మంది స్వైపింగ్ మిషన్లు కొనడంతో ఒక్కసారిగా వాటి సర్వర్ల మీద భారం పెరిగి ఇలా అవుతోందని, తాము ఇంతకుముందు కూడా కార్డులు తీసుకునేవాళ్లమని.. అప్పుడు అలా లేదని పెట్రోలుబంకులో పనిచేసే మనోజ్ యాదవ్ చెప్పారు. ఇప్పటివరకు ఎప్పుడూ తమ మిషన్లు హ్యాంగ్ అవడం గానీ, స్లో అవ్వడం గానీ లేదని.. కానీ ఇప్పుడు మాత్రం కార్డులను ఒకటికి మూడు నాలుగు సార్లు స్వైప్ చేస్తే తప్ప పని అవ్వడం లేదని చెప్పాడు.
తాను దక్షిణ ఢిల్లీలోని ఒక సెలూన్‌లో కటింగ్ చేయించుకున్నానని, అక్కడ మామూలుగా అయితే 70 రూపాయలే తీసుకుంటారు గానీ, తాను కార్డుతో చెల్లిస్తానంటే 90 రూపాయలు ఇవ్వాలన్నారని సిద్దార్థ అరోరా అనే పిల్లల వైద్యుడు చెప్పారు. కేంద్రప్రభుత్వం ఈ చార్జీలు రద్దుచేసిందని చెప్పి, వాళ్లకు పూర్తిగా వివరించిన తర్వాత.. ఎట్టకేలకు 70 రూపాయలు తీసుకోడానికి అంగీకరించారన్నారు.
Advertisement