
భువనేశ్వర్ : ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోన్నారు ‘ఒడిషా మోదీ’ అలియాస్ ప్రతాప్‌చంద్ర సారంగి. ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లో ప్రతాప్‌చంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రిగా స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆర్భాటాలకు ప్రాముఖ్యం ఇవ్వకుండా.. అతి సాధారణంగా జీవిస్తారు ప్రతాప్‌చంద్ర. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన జీవనశైలికి సంబంధించిన విశేషాలే కాకుండా.. మరి కొన్ని వివాదాస్పద అంశాలు కూడా వెలుగులోకొస్తున్నాయి. ప్రతాప్‌చంద్ర మీద ఏడు క్రిమినల్ కేసులున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
2002లో మితవాద గ్రూపులు, బజరంగ్ దళ్‌తో కలిసి ఒడిషా అసెంబ్లీ మీద దాడి చేసిన కేసులో ప్రతాప్‌చంద్ర అరెస్టయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక 1999లో ఆస్ట్రేలియన్ క్రైస్తవ మత గురువు గ్రాహం సాయినెట్‌తో పాటు అతని ఇద్దరి పిల్లల్ని బజరంగ్ దళ్ సభ్యులు కృరంగా చంపేశారు. ఆ మూకకు ప్రతాప్‌చంద్రే నాయకత్వం వహించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలు ఖండించారు ప్రతాప్‌చంద్ర. ఇవన్ని తప్పుడు కేసులని.. కావాలనే పోలీసులు తన మీద ఇలాంటి కేసులు పెట్టారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘లంచం తీసుకునే పోలీసులకు వ్యతిరేకంగా నేను పోరాటం చేశాను. దాంతో వారు నా మీద ఇలా తప్పుడు కేసులు పెట్టారు. ఇవన్ని తప్పుడు ఆరోపణలు అని కోర్టులే తేల్చాయి. చాలా కేసులను కొట్టేశాయి’ అని తెలిపారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో నిలిచారు ప్రతాప్‌చంద్ర. ఆటోలో ప్రచారం నిర్వహిస్తూ సామాన్యులకు చేరువయ్యారు. అదే విధంగా ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రతాప్‌చంద్రకు మద్దతుగా ప్రచార సభలో పాల్గొని ఆయనకు అండగా నిలిచారు. ఈ క్రమంలో సంపన్నులు, మీడియా చానళ్లు, రాజకీయ నేపథ్యం ఉన్న ప్రత్యర్థి అభ్యర్థులను మట్టికరిపించి బాలాసోర్ నుంచి తొలిసారి ఎంపీగా గెలుపొందారు. ప్రధాని నరేంద్ర మోదీ జంబో కేబినెట్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, పశుసంవర్ధక సహాయ మంత్రిగా పదవి దక్కించుకుని పలువురి దృష్టిని ఆకర్షించారు. (చదవండి : అప్పుడు టికెట్ పోయింది; ఇప్పుడేమో..)
Comments
Please login to add a commentAdd a comment