
న్యూఢిల్లీ: ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించిన జాతీయ ఆరోగ్య బీమా, ఉచిత ఎల్పీజీ సిలిండర్, రైతుల పంటకు కనీసమద్దతు ధరను 150 శాతం పెంచడంలాంటి సంక్షేమ పథకాలు ఈ ఏడాది జరగనున్న పలు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన అస్త్రాలుగా మారతాయని కమలనాథులు భావిస్తున్నారు. రైతులు, సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధుల కేటాయింపుతో రాబోయే ఎన్నికల్లో పార్టీ లబ్ధి పొందుతుందని విశ్వసిస్తున్నారు. ఇందుకనుగుణంగానే బడ్జెట్‌లో రైతులు, పేదల కోసం కేంద్రం తెచ్చిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ అధినాయకత్వం పార్టీ శ్రేణుల్ని ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ పట్టుకోల్పోయిందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టవచ్చని వెల్లడించాయి. ఈ నెల 18న త్రిపురలో, ఆ తర్వాత వరుసగా కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అన్నింటికంటే ముఖ్యంగా కర్ణాటకలో గెలవడం ద్వారా బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో బలహీనపడిందన్న కాంగ్రెస్ వాదనకు చెక్ పెట్టవచ్చని అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు బీజేపీ శ్రేణులు తెలిపాయి.