
'ఆ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండవు'
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం ద్వారా తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకున్నారు.
వచ్చే ఏడాది జనవరి నుండి కేంద్ర ప్రభుత్వం చేపట్టే నియామకాలైన గ్రూప్ డీ, సీ, బీ పోస్టులకు కేవలం రాత పరీక్షలలో కనబరిచిన ప్రతిభ ఆధారంగానే నియామకాలు చేపట్టనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. తక్కువ శ్రేణి ఉద్యోగాలకు ఇంటర్వ్యూను తొలగించే ప్రక్రియ పూర్తయిందని అన్నారు. ఆదివారం 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం ద్వారా తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. అవయవ దానం చాలా ప్రాముఖ్యత గల అంశమన్నారు. కేరళ నుంచి కొందరు బాలికలు, ఢిల్లీ నుండి దివేష్ అనే బాలుడు అవయవ దానం గురించి మాట్లాడాలని కోరినట్లు చెప్పారు. అవయవ దానాన్ని కొన్ని రాష్ట్రాలు సులువుగా మార్చాయని పేర్కొన్నారు. తమిళనాడు ఈ విషయంలో బాగా కృషి చేస్తుంది. ముఖ్యమైన అవయవాలైన కిడ్నీలు, గుండె మార్పిడిలో అవయవదానం మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆదర్శ గ్రామ యోజన పథకంలో ఎంపీలు చురుగ్గా పాల్గొంటున్నారన్నారని మోదీ కితాబిచ్చారు.
బంగారు నగదీకరణ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపిన మోదీ అశోక చక్ర ఉన్న బంగారు నాణేన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఆర్థిక భద్రత గల పథకాలను ప్రవేశపెడుతామన్నారు. స్వచ్ఛ భారత్ విషయంలో మీడియా కృషికి ధన్యవాదాలు తెలిపారు.
భారత్, ఆఫ్రికా సదస్సు గురించి మాట్లాడుతూ.. భారత్, ఆఫ్రికాల మధ్య చాలా అంశాలలో సారూప్యత ఉంది. భారత సంతతీయులు చాలా మంది ఆఫ్రికాలో ఉన్నారు. ఈ రోజు ముంబైలో జరగనున్న దక్షిణాఫ్రికా-భారత్ ఐదవ వన్డే రసవత్తరంగా ఉంటుందనే ఉత్సుకతను మోదీ వ్యక్తం చేశారు.