భారత్, శ్రీలంక మధ్య ‘ఆర్థిక’ బంధం
లంక ప్రధానితో మోదీ చర్చలు
న్యూఢిల్లీ: భారత పర్యటనలో ఉన్న శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘేతో ప్రధాని మోదీ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చించారు. ఆ తరువాత భారత్, శ్రీలంక మధ్య ఆర్థిక సహకార ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వైపాక్షిక ఆర్థిక సహకారానికి ఎజెండాను నిర్దేశిస్తుంది. ఇరు వర్గాలకు ప్రయోజనం కలిగించే ఈ ఎజెండాను త్వరితగతిన అమలుచేయడానికి కట్టుబడి ఉన్నామని రెండు దేశాలు ప్రకటించాయి. శ్రీలంకలో భారత్ పెట్టుబడులు పెట్టేందుకు వీలున్న మౌలిక వసతుల ప్రాజెక్టులను గుర్తించడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది.
ఆర్థిక, సాంకేతిక సహకారం ఒప్పందంపై జరుగుతున్న చర్చలను కూడా త్వరలోనే ముగిస్తామని ఇరు దేశాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. శ్రీలంక తన శాంతి పునరుద్ధరణ ప్రక్రియను రెండేళ్లలో పూర్తిచేస్తుందని ఆశిస్తున్నట్లు భారత్ తెలిపింది. సముద్ర లోతుల్లో మన జాలర్లు చేపలు పట్టడానికి సంబంధించి తీసుకున్న చర్యలను శ్రీలంకకు వివరించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ మన జాలర్లపై బలప్రయోగం చేయకూడదని కూడా ఆ దేశాన్ని కోరామని, వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించింది. ‘ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేయడానికి ఉన్న మార్గాలపై శ్రీలంక ప్రధానితో సమగ్ర చర్చలు జరిపాం’ అని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన సమావేశం తరువాత మోదీ ట్వీట్ చేశారు. ‘గత రెండేళ్లలో ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలు సమీక్షకు ప్రస్తుత సమావేశం ఉపకరిస్తుంది’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.