నల్లధనంపై ఉక్కుపాదం
- బడ్జెట్‌లో కఠిన చట్టాలను ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి జైట్లీ
- విదేశీ ఆస్తులపై పన్ను ఎగవేస్తే పదేళ్ల జైలు
- 300రెట్లు జరిమానా, ఆస్తుల జప్తు, మార్కెట్ రేటుపై
- పన్ను విధింపు.. కొత్త చట్టానికి ఈ సమావేశాల్లోనే బిల్లు
- రియల్ ఎస్టేట్‌లో నగదు లావాదేవీలకు పరిమితి..
- డెబిట్/క్రెడిట్ కార్డుల వినియోగానికి ప్రోత్సాహం
- బినామీ లావాదేవీల నిషేధిత బిల్లుకు ప్రతిపాదన..
- ఐటీ రిటర్నుల్లో మోసాలకు ఏడేళ్ల వరకు శిక్ష
- లక్ష పైబడిన క్రయవిక్రయాలకు ‘పాన్’ తప్పనిసరి
- ఐటీ, ఫెమా, పీఎంఎల్‌ఏ చట్టాలకూ సవరణలు
న్యూఢిల్లీ: నల్లధన ప్రవాహ కట్టడికి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు ప్రతిపాదించింది. నల్లధనాన్ని రూపుమాపే వరకు దేశంలో పేదరికం, అసమానతలు తొలగిపోవని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఈ దిశగా కఠిన శిక్షలతో కూడిన సమగ్ర చట్టాన్ని ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తీసుకురానున్నట్లు ప్రకటించారు. ‘సమాజాన్ని, ఆర్థికరంగాన్ని తొలిచేస్తున్న నల్లధనాన్ని అరికట్టే కొత్త చట్టాన్ని తీసుకురావడం నా పన్ను ప్రతిపాదనల్లో తొలి అడుగు. ఈ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెడతాం. దీని ప్రకారం విదేశీ ఆదాయం, ఆస్తులను కలిగి ఉండి పన్ను ఎగవేసే వారిపై విచారణ జరిపి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించవచ్చు. అంతేకాదు, ఈ కేసులో రాజీకి వీలుండదు.
పన్ను ఎగవేతదారులు పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించలేరు. ఇక దేశీయంగా నల్లధనాన్ని అడ్డుకోడానికి కొత్త, సమగ్ర బినామీ లావాదేవీల(నిషేధిత) బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెడతాం. దీంతో బినామీల పేరుతో ఆస్తులను కూడబెట్టే వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో నల్లధనాన్ని అరికడతాం’ అని బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో నేరుగా నగదు లావాదేవీలను నిరుత్సాహపరిచేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. నగదు లావాదేవీలకు పరిమితి విధించి, డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. అలాగే స్థిరాస్తి కొనుగోలు సమయంలో రూ. 20 వేలకన్నా ఎక్కువ నగదును అడ్వాన్స్‌గా తీసుకోవడాన్ని నిషేధించేలా ఇన్‌కంటాక్స్ చట్టాన్ని సవరించాలని జైట్లీ ప్రతిపాదించారు. నిబంధలను ఉల్లంఘిస్తే అంతే మొత్తం జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇకపై లక్ష రూపాయలకు పైబడిన కొనుగోలు/అమ్మకాల విషయంలో పాన్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. విదేశీ నగదు విక్రయాలు, సీమాంతర లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని థర్డ్ పార్టీ సంస్థలు విధిగా సమర్పించాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి స్పష్టంచేశారు.
పన్ను ఎగవే త దారులపై కఠిన చర్యలు
లావాదేవీలను విభజించి చూపి పన్నులు తప్పించుకునే విధానాన్ని కూడా అడ్డుకునేందుకు ప్రత్యేక నిబంధనలు రూపొందించనున్నట్లు జైట్లీ తెలిపారు. ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ), ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విభాగం(సీబీఈసీ)ల మధ్య సమన్వయం అవసరమని, ఇరు విభాగాల డేటాబేస్‌లను సంయుక్తంగా వినియోగించుకునేలా టెక్నాలజీని రూపొందిస్తామని మంత్రి పేర్కొన్నారు. అలాగే విదేశీ ఆస్తులపై పన్ను ఎగవేస్తే ఆ మొత్తానికి 300 రెట్లు జరిమానా విధిస్తామన్నారు. అలాంటి ఆస్తులపై గరిష్ట మార్కెట్ రేటు ప్రకారమే పన్ను విధిస్తామని కూడా చెప్పారు. ‘‘రిటర్న్‌లు దాఖలు చేయకపోయినా, విదేశీ ఆస్తులకు సంబంధించి తప్పుడు వివరాలతో రిటర్న్‌లు సమర్పించినా ఏడేళ్ల వరకు శిక్ష పడుతుంది. అలాగే విదేశీ ఖాతాను తెరిచిన తేదీని తప్పనిసరిగా ఐటీ రిటర్న్‌లో పేర్కొనాలి. విదేశీ ఆస్తుల విషయంలో పన్ను ఎగవేతకు పాల్పడితే మనీలాండరింగ్ చట్టం(పీఎంఎల్‌ఏ) కింద చర్యలు తీసుకుంటాం. ఇతర దర్యాప్తు సంస్థలు కూడా సదరు ఆస్తులను జప్తు చేసి నల్లధనాన్ని కలి గిన వ్యక్తులు/సంస్థలపై దర్యాప్తు చేపడతాయి. విదేశీ నగదు నిర్వహణ చట్టం(ఫెమా) నిబంధనలను కూడా సవ రిస్తున్నాం’’ అని జైట్లీ వివరించారు.
సిట్‌కు పెరిగిన కేటాయింపులు
నల్లధనం కేసులపై విచారణకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు తాజా బడ్జెట్‌లో కేటాయింపులు పెరిగాయి. విచారణ వేగవంతంగా సాగడానికి మౌలిక వసతులు, సౌకర్యాల కల్పన కోసం వీటిని వాడతారు. గతేడాది సిట్‌కు రూ. 41.34 కోట్లు కేటాయించగా, ఈసారి రూ. 45.39 కోట్లు దక్కాయి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎం.బి. షా, వైస్ చైర్మన్ అరిజిత్ పసాయత్ నేతృత్వంలోని సిట్‌లో 11 మంది సభ్యులు ఉన్నారు. భారత్ నుంచి విదేశాలకు తరలిన నల్లధనంపై ఈ బృందం దృష్టిసారించిన సంగతి తెలిసిందే.