సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: తెలంగాణలో రైల్వే ప్రాజెక్ట్‌లు త్వరితగతిన పూర్తి చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖతో అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. గురువారం రైల్వే బోర్డు చైర్మన్ ఏకే మిత్తల్ సమక్షంలో ఎంఓయూపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి సునీల్ శర్మ, రైల్వే నుంచి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వేద్ ప్రకాశ్ సంతకాలు చేశారు.
వివిధ రాష్ట్రాలలో రైల్వే లైన్ల డిమాండ్ నానాటికీ పెరుగుతోందని, నిధుల కొరత వల్ల వాటిని నిర్మించడానికి రాష్ట్రాలతో రైల్వేల భాగస్వామ్యం అవసరమని రైల్వే బోర్డు చైర్మన్ మిత్తల్ ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణలో కొద్ది నెలల్లో ఏర్పాటయ్యే జాయింట్ వెంచర్ కంపెనీకి ఈ ఎంఓయూ పునాదిరాయి వంటిదన్నారు. ఈ ఎంఓయూ కింద ఏర్పాటయ్యే స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ) వల్ల నిధుల సమీకరణతో పాటుగా త్వరితగతిన అనుమతులు లభిస్తాయని, అందువల్ల కీలక మౌలికవసతులు కల్పించే ప్రాజెక్ట్‌లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు.
చైర్మన్ నియామకం రాష్ట్రం చేతిలో
జాయింట్ వెంచర్ కంపెనీలో రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ భాగస్వాములు కాగా, ఈ కంపెనీకి చైర్మన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ కంపెనీ అవసరమైన ప్రాజెక్ట్‌లను గుర్తించి, వాటికి కావాల్సిన ఆర్థిక వనరులను సేకరిస్తుంది. నిధుల లభ్యత ఖరారైన తర్వాత ప్రాజెక్ట్‌లకు స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ ఎస్‌పీవీలో పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలు భాగస్వాములు కావచ్చు. ఎంఓయూ ప్రకారం ప్రాజెక్ట్‌ల అమలుకు అయ్యే వ్యయంలో 51% రాష్ట్ర ప్రభుత్వం, 49% రైల్వే శాఖ భరించాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్‌లను పూర్తిచేయడంలో ఎస్‌పీవీ పూర్తి బాధ్యత వహిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి సునీల్ శర్మ చెప్పారు. ఈ ఎంఓయూ కింద చేపట్టే ప్రాజెక్ట్‌లను ఇంకా గుర్తించాల్సి ఉందని, జాయింట్ వెంచర్ కంపెనీ ప్రధాన కార్యాలయం రాష్ట్రంలోనే ఏర్పాటవుతుందని ఆయన చెప్పారు.
రైల్వేలతో రాష్ట్రం ఎంఓయూ
Published Fri, Feb 12 2016 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 PM
Advertisement
Advertisement