ఎస్సీ వర్గీకరణ హామీని విస్మరిస్తారా?
- కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌పై మండిపడ్డ ఎమ్మార్పీఎస్
- జంతర్‌మంతర్ వద్ద రెండోరోజుకు చేరుకున్న నిరసనలు
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ చేపట్టిన నిరసన బుధవారం రెండో రోజుకు చేరుకుంది. మాదిగ న్యాయవాదులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2012లో వర్గీకర ణ కోసం మాదిగ లాయర్లు చేపట్టిన దీక్షలో అప్పటి ప్రతిపక్ష నాయకురాలిగా సుష్మాస్వరాజ్ పాల్గొని మద్దతిచ్చిన విషయాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, మాదిగ లాయర్ల ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు బైరపాక దయాకర్ గుర్తు చేశారు. నాడు వర్గీకరణకు హామీ ఇచ్చి, నేడు అధికారంలోకి వచ్చాక విస్మరించడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు.
రాజ్యాంగ సవరణ చేయించి వర్గీకరణ సాధించే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రే యకు కృష్ణమాదిగ వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ వర్గీకరణ కోసం 25 రోజులపాటు కొనసాగనున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరిని మందకృష్ణ ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల పంపిణీ జరిగితే సామాజిక న్యాయం జరుగుతుందని సీపీఐ ఎంపీ డి.రాజా అభిప్రాయపడ్డారు.