కల సాకారం
సాక్షి, చెన్నై: కేరళ రాష్ట్రం ఇడిక్కిలోని ముల్లైపెరియార్ డ్యామ్‌పై సర్వ హక్కుల్ని తమిళనాడు ప్రభుత్వం కలిగి ఉంది. ఈ నీటి మీద రాష్ట్రంలోని తేని, శివగంగై, రామనాథపురం, మదురై, విరుదునగర్ జిల్లాలు ఆధారపడి ఉన్నాయి. ఆ హక్కుల్ని కాలరాయడమే లక్ష్యంగా కేరళ సర్కారు కుట్రలు, కుతంత్రాలు చేస్తోంది. ఈ క్రమంలో తరచూ రెండు రాష్ట్రాల సరిహద్దులో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతోంది. ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన డ్యామ్ బలహీనంగా ఉందన్న కుంటి సాకుతో నీటి మట్టాన్ని క్రమంగా తగ్గించే పనిలో కేరళ సర్కారు పడింది. ఆ డ్యామ్ నీటి సామర్థ్యం తొలినాళ్లలో 152 అడుగులు. కేరళ కుట్రలతో 1979లో నీటి మట్టం 136 అడుగులకు తగ్గించారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో పోరాటం చేస్తూనే ఉంది. ఎన్నో ఆందోళనలు, ఎన్నో పోరాటాలు బయలుదేరాయి.
ఈ నేపథ్యంలో ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆ డ్యామ్ నీటి మట్టాన్ని 142 అడుగులకు పెంచుకునేలా ఆదేశించడం శుభ పరిణామం.రంగంలోకి కమిటీ: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర నీటి పారుదల శాఖ ప్రధాన ఇంజనీర్ ఎల్‌ఏవీ నాథన్, తమిళనాడు ప్రభుత్వ ప్రజా పనుల శాఖ కార్యదర్శి సాయికుమార్, కేరళ నీటి పారుదల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి కురియన్ నేతృత్వంలోని కమిటీని కేంద్రం రంగంలోకి దించింది. ఈ కమిటీ నీటి మట్టం పెంపుపై దృష్టి కేంద్రీకరించింది. డ్యామ్ సామర్థ్యం, పటిష్టతను పూర్తిగా పరిశీలించిన ముల్లైపెరియార్ డ్యామ్ పర్యవేక్షణ కమిటీ కేరళ వేదికగా రెండుసార్లు సమావేశమైంది. చివరి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆ డ్యామ్‌ను పరిశీలించేందుకు కమిటీ చైర్మన్ ఎల్‌ఏవీ నాథన్ నిర్ణయించారు.
ఆ మేరకు గురువారం ఉదయం ఇడిక్కి నుంచి బోటులో ముల్లై పెరియార్ డ్యామ్‌ను పూర్తిగా పరిశీలించారు. నీటి నిల్వ, గేట్ల పటిష్టత, డ్యామ్ పరిసరాల్లో ఇప్పటి వరకు చేపట్టిన పనులు, ఇక మీదట చేపట్టాల్సిన పనులపై ఆరా తీశారు. ఆ డ్యామ్ గేట్లను కిందకు పైకు దించుతూ, నీటి ఉద్ధృతిని పరిశీలించారు. చివరకు గేట్లను 136 అడుగుల నుంచి 146 అడుగులకు పెంచడం తమిళుల్లో ఆనందాన్ని రెకెత్తించింది. 36 ఏళ్లుగా సాగిన పోరాటానికి ఫలితం దక్కనుందన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. డ్యామ్ గేట్లను 146 అడుగులకు చేర్చిన దృష్ట్యా నీటి నిల్వ ఆ మట్టానికి చేర్చే ఉత్తర్వులు ఏ క్షణాన్నైనా వెలువడే అవకాశాలు కన్పిస్తున్నాయి. డ్యామ్‌ను పరిశీలించిన అనంతరం కుములి వేదికగా ఈ కమిటీ రాత్రి సమావేశం కాబోతోంది. ఈ సమావేశానంతరం నీటి పెంపుపై ఉత్తర్వులు వెలువడొచ్చన్న సంకేతాలు ఉన్నాయి. అలాగే డ్యామ్ నీటి మట్టం పెంపు ఉత్తర్వులు వెలువడగానే అందుకు తగ్గ పనుల్ని రాష్ర్ట ప్రజా పనుల శాఖ సిద్ధం చేయడం విశేషం.