ఆర్థిక రాజధాని అతలాకుతలం | Mumbai is Covid-19 tally rises to 33835 | Sakshi
Sakshi News home page

ఆర్థిక రాజధాని అతలాకుతలం

Published Thu, May 28 2020 5:02 AM | Last Updated on Thu, May 28 2020 5:02 AM

Mumbai is Covid-19 tally rises to 33835 - Sakshi

ఎందరికో అదొక కలల నగరం
ఉపాధి అవకాశాలతో ఎందరినో అక్కున చేర్చుకున్న నగరం
పగలు, రాత్రి అన్న తేడా లేకుండా శ్రమించే నగరం
ఇప్పుడు కరోనా కాటుతో విలవిలలాడుతోంది. 
ముంబైవాసులకు ప్రతీ రాత్రి కాళరాత్రిగానే మారుతోంది.


ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కోవిడ్‌ విలయతాండవం చేస్తోంది. మహారాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 62 శాతం ముంబైలోనే ఉన్నాయి. ఒకే రోజు 1,002 కేసులు నమోదు కావడంతో 32 వేలు దాటేశాయి. కేవలం 10 రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపైంది. కేసుల పెరుగుదల రేటు ఇలాగే కొనసాగితే జూన్‌ చివరి నాటికి ముంబైలో లక్ష కేసులు దాటిపోతాయని ఒక అంచనా. ఇక మృతుల సంఖ్య 1,065కి చేరుకుంది.

కారిడార్లలోనే శవాలు
ముంబైలో కోవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తున్న కింగ్‌ ఎడ్వర్డ్‌ మెమోరియల్‌ (కేఈఎం) ఆస్పత్రి రోగులతో కిటకిటలాడిపోతోంది. మరణాలు ఎక్కువగా ఉండడంతో మార్చురీ సదుపాయాలు సరిపోక కారిడార్లలోనే శవాలను ఉంచుతున్నారు. ‘మార్చురీలో ఒకేసారి 27 మృతదేహాలను మించి ఉంచడానికి సదుపాయం లేదు. మృతుల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో చేసేదేమీలేక స్ట్రెచర్లపై శవాలను కారిడార్లకి ఇరువైపులా ఉంచుతున్నారు’అని కేఈఎం ఆస్పత్రి ఉద్యోగుల సంఘం నేత సంతోష్‌ ధూరి చెప్పారు. ఇక ఆరోగ్య సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రిలో సదుపాయాలు లేని విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్‌ తోపె అంగీకరించారు. ‘ఆక్సిజన్‌ సరఫరాతో కూడిన 10వేల పడకలు తక్షణమే కావాలి. ఆ ఏర్పాట్లలోనే ఉన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకి చెందిన డాక్టర్లు కోవిడ్‌ రోగులకు చికిత్స చేస్తున్నారు. వైరస్‌ సోకుతున్న వారిలో అత్యధికులకి ఆక్సిజన్‌ పెట్టాల్సిన అవసరం ఏర్పడుతోంది’అని మంత్రి చెప్పారు.

ముగ్గురు రోగులకు ఒకే ఆక్సిజన్‌ ట్యాంక్‌  
ముంబైలో కోవిడ్‌ రోగులకు చికిత్సనందించే సియోన్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ట్యాంకులకు కొరత ఉండడంతో ముగ్గురు రోగులకు ఒకటే అందిస్తున్నారు. ఎక్కువ రోగులకు చికిత్స అందించడానికి వీలుగా మంచాల మధ్య దూరాన్ని తగ్గిస్తున్నారు. ఒకవైపు మృతదేహాలను పక్కనే ఉంచుకొని మరోవైపు రోగులకు చికిత్స అందిస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి ఆందోళన పెంచుతున్నాయి. ‘ముంబైలో వైద్య సౌకర్యాలు, సుశిక్షితులైన సిబ్బంది ఎక్కువగానే ఉన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో కేసులు పెరిగిపోతుంటే ఆస్పత్రులు తట్టుకోలేకపోతున్నాయి. కలల నగరం కాళరాత్రి నగరంగా మారింది’’అని ప్రజారోగ్య వైద్య నిపుణురాలు డాక్టర్‌ స్వాతి రాణె అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నప్పటికీ ముంబైలో కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.  

ఆస్పత్రి సదుపాయాలు ఇలా..
► ముంబైలో 20,700 పడకల సామర్థ్యం ఉన్న 70 ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. మరో 20 వేల పడకలతో 1500 ప్రైవేటు ఆస్పత్రులున్నాయి.  
► సగటున ప్రతీ 550 మందికి ఒక పడక ఉండాలని ప్రపంచ ఆరోగ్య శాఖ అంచనా వేస్తే ముంబైలో ప్రతీ 3 వేల మందికి మాత్రమే ఒక పడక ఉంది.  
►  పదేళ్లలో ముంబై జనాభా విపరీతంగా పెరిగింది. ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన నగరాల్లో ముంబై కూడా ఒకటి. ప్రతీ చదరపు కిలోమీటర్‌కి 32 వేల మంది వరకు నివసిస్తారు. పెరిగిన జనాభాకి తగ్గట్టుగా వైద్య సదుపాయాలు పెరగలేదు.  



కరోనా వ్యాప్తి కట్టడితోపాటు ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి ఇప్పటికే 1.1 ట్రిలియన్‌ డాలర్లతో నిధిని ఏర్పాటు చేసిన జపాన్‌ మరో 296 బిలియన్‌ డాలర్లు కేటాయించాలని నిర్ణయించింది. ఈ అనుబంధ బడ్జెట్‌కు జపాన్‌ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నిధులను దెబ్బతిన్న వ్యాపారాలను ఆదుకోవడానికి, స్థానిక ప్రభుత్వాలకు రాయితీలకు ఖర్చు చేస్తారు.


 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement