పట్నా: పుల్వామా ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు కారకులైన వారిని ఉపేక్షించబోమని ఇప్పటికే ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ తన గుండెల్లోని ఆవేదనను ప్రజలతో పంచుకున్నారు. ఆదివారం బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలలో మోదీ పర్యటించారు. పట్నాలో మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన మోదీ.. బరౌనిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు మోదీ సంతాపం తెలిపారు. బిహార్ రాష్ట్రానికి చెందిన అమర జవాన్లు సంజయ్ కుమార్ సిన్హా, రతన్‌కుమార్ ఠాకూర్‌లకు ఆయన నివాళులర్పించారు.
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో దేశ ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉందో తన హృదయంలో అంతే ఆగ్రహం ఉందని తెలిపారు. దీనిని చూస్తుంటే గుండె మండిపోతుందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీలు పాల్గొన్నారు. ఆ తర్వాత మోదీ జార్ఖండ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జార్ఖండ్‌కు చెందిన అమర జవాన్ విజయ్ సోరెంగ్‌కు నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment