ఏకం కావల్సిన సమయం ఇదే?!
- రోహింగ్యాల మూలాలు లేవు
- వాళ్లంతా బంగ్లా వలసదారులే
- రోహింగ్యాలకు ఉగ్రవాదులతో సంబంధాలు
యాంగాన్ : రోహింగ్యాల విషయంలో మయన్మార్ వాసులంతా ఏకం కావాలని.. ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ మిన్ ఆంగ్ హలియాంగ్ ఆదివారంనాడు పిలుపునిచ్చారు. మయన్మార్‌లో రోహింగ్యాల మూలాలు ఎక్కడా లేవని.. ఆయన పేర్కొన్నారు. గత నెల 25న రోహింగ్యా మిలిటెంట్లు పోలీస్ పోస్ట్‌లపై క్రమపద్ధతిలో దాడులు చేశారని అన్నారు. ఈ ఘటన అనంతరమే సైన్యం ఉత్తర రఖైనే రాష్ట్రంలో మిలిటెంట్ల ఏరివేతకు దిగింది. మిలిటెంట్ల ఏరివేతకు ప్రయత్నిస్తున్న తరుణంలో భారీగా హింస చెలరేగింది. దీంతో సరిహద్దుల్లో ఉన్న 4 లక్షల మంది రోహింగ్యాలు బంగ్లాకు శరణార్థులుగా వెళ్లారని.. చెప్పారు.
అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్యసమితి పేర్కొంటున్నట్లు.. జాతి నిర్మూలనకు మా సైన్యం దిగలేదని ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు. అసలు రోహింగ్యాల మూలాలు మా దేశంలో ఎందుకుంటాయని ఆయన ఎదురు ప్రశ్నించారు. మయన్మార్‌కు స్వతంత్రం వచ్చాక.. నాటి తూర్పుపాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్) నుంచి వేల సంఖ్యలో ప్రజలు ఇక్కడకు వలస వచ్చారని.. వారే తరువాత రోహింగ్యా ముస్లింలుగా స్థిరపడ్డారని ఆర్మీ చీఫ్ చెబుతున్నారు.
రోహింగ్యాలకు వ్యతిరేకంగా చాలా ఏళ్ల నుంచి సైన్యం వ్యతిరేక ప్రచారం చేస్తోందని తెలుస్తోంది. ఈ కారణం వల్లే స్థానిక బౌద్ధులు.. సైన్యానికి పూర్తిగా సహకరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. దేశ సరిహద్దులు దాటి శరణార్థులుగా వెళ్లిన రోహింగ్యాలను ఇక దేశంలోకి అనుమతించేదిలేదంటూ మయన్మార్ ప్రభుత్వం సూచనప్రాయంగా ప్రకటించింది. వలస వెళ్లిన రోహింగ్యాలకు అంతర్జాతీయ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని సైన్యాధిపతి స్పష్టం చేస్తున్నారు.