
ఢిల్లీ : కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచానికి భారత ఫార్మా రంగం సత్తా తెలిసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విపత్తు వేళ భారత ఫార్మా రంగం దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా ఒక ఆస్తిగా మారిందని అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ధరకు మందులు సమకూర్చుస్తున్న ఘనత భారత్‌దేనన్నారు. గురువారం బ్రిటన్ వేదికగా నిర్వహించిన ‘ఇండియా గ్లోబల్ వీక్-2020’ సదస్సులో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగించారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి విశేష కృషి చేస్తూ వైరస్‌పై ప్రపంచం సాగిస్తున్నపోరులో భారత్ భాగస్వామ్యం అయ్యిందన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీకి జరుగుతున్నఅంతర్జాతీయ ప్రయత్నాల్లో భారత ఫార్మా సంస్థలు చురుకైన పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. (ఆన్‌లైన్ క్లాసులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు)
వ్యాక్సిన్ తయారీ భారత్ బాధ్యత అని ప్రపంచంలో 2/3వంతు చిన్నారులకు వ్యాక్సిన్ అవసరమని తెలిపారు. టీకాను కనుగొంటే దాని అభివృద్ధి, ఉత్పత్తిలో భారత్ పాత్ర క్రియాశీలకంగా ఉంటుందనడంలో సందేహం లేదన్నారు. భారతీయులు సహజ సంస్కర్తలని చరిత్రే ఇందుకు నిదర్శమని పేర్కొన్నారు. ఎన్నో సామాజిక, ఆర్థిక సవాళ్లను అధిగమించిన చరిత్ర భారత్‌కు ఉందన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో భారత్ అసమాన పోరాటం చేస్తోందని, ప్రజా ఆరోగ్య సంరక్షణతోపాటు ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ సాధనకు కృషి చేస్తున్నామని ప్రధాని వెల్లడించారు.(భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న కరోనా!)
‘పునరుజ్జీవన భారతదేశం, కొత్త ప్రపంచం’ నినాదంతో ఇండియా గ్లోబల్ వీక్-2020 సమావేశాలు బ్రిటన్ వేదికగా గురువారం నుంచి మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 5వేల మంది ఇందులో పాల్గొనున్నారు. 75 సెషన్లలో 30 దేశాలకు చెందిన 250మంది ప్రపంచ ప్రతినిధులు ప్రసంగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment