న్యూఢిల్లీ: కరోనా వైరస్ టీకా అందరికీ అందుబాటులో, చవకగా లభించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. టీకా తయారీ, అందుబాటు ప్రక్రియలపై ప్రధాని మోదీ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, కొన్ని మార్గదర్శకాలను సూచించారు. టీకా అందుబాటులోకి వచ్చిన తరువాత.. ముందుగా టీకా ఇవ్వాల్సిన వర్గాల జాబితా రూపొందించాలన్నారు. ముప్పు ఎక్కువగా ఉన్న వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, వైద్యేతర వర్గాలైన పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.. ‘టీకాల ఉత్పత్తి, సరఫరా, ప్రాధాన్యతాక్రమ రూపకల్పన, వివిధ విభాగాల మధ్య సమన్వయం, పౌర సమాజం, ప్రైవేటు రంగ భాగస్వామ్యం మొదలైన అంశాలను చర్చలో మోదీ ప్రస్తావించారు’ అని పీఎంఓ ఒక ప్రకటనలో పేర్కొంది. దీనికి సంబంధించి నాలుగు కీలకాంశాలను మోదీ పేర్కొన్నారని తెలిపింది. ‘అవి ఒకటి, ముప్పు ఎక్కువగా ఉన్నవారితో ప్రాధాన్యత క్రమం రూపొందించాలి. రెండు, ఎలాంటి వివక్ష చూపకుండా, ఆంక్షలు విధించకుండా, అందరికీ, అన్ని చోట్ల టీకాను అందించాలి. మూడు, అందుబాటులో ఉండే ధరలో సార్వత్రికంగా టీకాను అందించాలి. నాలుగు, తయారీ నుంచి వాక్సినేషన్ వరకూ మొత్తం ప్రక్రియను టెక్నాలజీ సాయంతో సమీక్షించాలి’ అని మోదీ నిర్దేశించారని పీఎంఓ పేర్కొంది. ఈ దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రక్రియలో టెక్నాలజీని సమర్ధవంతంగా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో పరిశీలించాలని అధికారులను పీఎం ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment