
న్యూఢిల్లీ/పుణె: మహిళలకు భద్రత కల్పించడంలో పోలీసులు సమర్థవంతమైన పాత్ర నిర్వహించాలని ప్రధాని మోదీ అన్నారు. పుణెలో జరుగుతున్న 54వ డీజీపీ, ఐజీపీల జాతీయ సదస్సులో ఆదివారం ఆయన ప్రసంగించారు. పోలీసుల గౌరవాన్ని పెంచేలా అధికారులు కృషి చేయాలని, సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు..ముఖ్యంగా మహిళలు, చిన్నారుల భద్రతపై విశ్వాసం పెంచాలని కోరారు. దేశంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు, ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
సాధారణ పౌరుల నమ్మకాన్ని చూరగొనేందుకు పోలీసింగ్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. పోలీసు అధికారులు నిత్యం విధి నిర్వహణలో ఎదుర్కొనే సవాళ్ల గురించి తనకు తెలుసునంటూ ప్రధాని..‘ఇలాంటివి ఎన్ని ఉన్నా సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరైనప్పుడు ఉన్న ఉత్సాహం, ఆదర్శ భావాలను మనసులో ఉంచుకుంటూ జాతిహితం, సమాజంలోని పేదలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు’అని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
అవసరాల మేరకు చట్టాల్లో మార్పులు
దేశ అవసరాలకు అనుగుణంగా చట్టాలను మార్చేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్‌పీసీ)లను మెరుగుపరిచేందుకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా అన్ని రాష్ట్రాలను హోం శాఖ కోరిన నేపథ్యంలో ఆయన ఈ విషయం వెల్లడించడం గమనార్హం.
ఉగ్రవాద శక్తులను నిర్వీర్యం చేయాలి
సార్క్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సార్క్ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు. ఉగ్రవాదాన్ని సమష్టిగా ఎదుర్కోవడంతోపాటు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. పాకిస్తాన్‌ను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment