
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యహరించక.. అప్రమత్తంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను హెచ్చరిస్తూ నిన్న రాత్రి 8 గంటలకు ప్రసంగించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగా ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటించాలనీ, అత్యవసరమైతే తప్పా ప్రజలు, ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వద్ధులు ఇళ్లు వీడి వీధుల్లోకి రాకూడదంటూ మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ప్రజలను ఎంతగానో ఉత్తేజితుల్ని చేసింది. అంతేగాక ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’ను పాటించాల్సిందిగా ఆయన ఇచ్చిన పిలుపును పాటించేందుకు దేశ ప్రజలు సిద్దమయ్యారు. కరోనా వైరస్ అప్రమత్తతపై ప్రజలు తీసుకోవాల్సిన చర్యల గురించి ఉత్తేజితంగా చెప్పుకొచ్చిన మోదీ కరోనా వైరస్ నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యల గురించి సమగ్రంగా వివరించకపోవడం విచారకరం. (22న జనతా కర్ఫ్యూ)
ఈ వైరస్ కారణంగా దేశ ఆర్థిక రంగానికి పొంచివున్న పెను ముప్పును ఎదుర్కొనేందుకు ‘ప్రత్యేక టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు చేస్తున్నట్లు మాత్రమే ఆయన ప్రకటించారు. అదీ కూడా ఎంతో ఆలస్యంగా. ఇక అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు ఇప్పటికే వారి దేశ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగించి ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలతో పాటు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఎంతో కొంత వివరించారు. కాగా చైనాలో పుట్టిన కరోనా వైరస్ గతేడాది డిసెంబర్ నెలలో బట్టబయలు కాగా.. ఆ దేశం నుంచి మనకు ప్రమాదం పొంచి ఉందన్న విషయం జనవరి తొలి పక్షం నాటికే భారత్‌కు తెలిసింది. ఇక ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితిపై కరోనా ప్రతికూల ప్రభావం ఫిబ్రవరి మొదటి వారంలోనే బయట పడింది. (ప్రధాని మోదీని ఫాలో అవుదాం: కోహ్లి)
అయితే టాస్క్ ఫోర్స్‌ను వేయడంలో కేంద్రం నెల రోజులు ఆలస్యం చేసింది. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు రైళ్లు రద్దు, విమాన సర్వీసుల నిలిపివేయడం లాంటి ముందుస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్న కేంద్రం, ప్రజల కోసం ఎలాంటి ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించకపోవడం శోచనీయం. చెప్పాలంటే ఈ విషయంలో ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలే ముందున్నాయి. ప్రజలకు ఉచితంగా రేషన్ అందించేందుకు, వడ్డీలేని రుణాలను మంజూరు చేసేందుకు, నిరుద్యోగ భృతిని అమలు చేసేందుకు కేరళ ప్రభుత్వం రూ. 20 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. దేశంలోనే అత్యంత వెనకబడిన రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం, ప్రజల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ ప్రకటించడం విశేషం.