67వ పడిలోకి మోదీ.. ప్రముఖుల అభినందనలు
సాక్షి, గాంధీనగర్: సరిగ్గా మూడేళ్ల క్రితం నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ దేశ ప్రధాన మంత్రిగా ప్రమాణం చేస్తున్న సమయమది. సొంత రాష్ట్రం గుజరాత్ సహా దేశంలోని బీజేపీ కార్యకర్త సంబరాలు అంబరాన్నంటాయి. 12 ఏళ్లపాటు ఒక రాష్ట్రాన్ని విజయవంతంగా పాలించి.. దేశ ప్రజల దృష్టిలో సమర్థుడిగా మన్ననలు పొందిన వ్యక్తి ప్రధాని కావటం కన్నా ఇంకేముందన్న భావన పార్టీ నేతల్లో నెలకొంది. అయితే గాంధీనగర్‌లో 95 ఏళ్ల హీరాబెన్ మాత్రం కన్నీటి ధారలతో తన కొడుకు ప్రసంగ కార్యక్రమం టీవీల్లో చూస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
తన కొడుకు దేశ సేవకు అంకితం కావటం కంటే తనకు ఇంకేం కావాలన్నది ఆమె ఉద్దేశ్యం అయి ఉండొచ్చు. సరిగ్గా నాలుగు నెలల తిరగక ముందే తన పుట్టిన రోజున తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు మోదీ. ఆ సమయంలో తను దాచుకున్న 5001 రూపాయలను కశ్మీర్ వరద బాధితులకు సహాయంగా అందించారు హీరాబెన్. ఇక గతేడాది(2016)లో కూడా తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. కొన్నాళ్లకు తొలిసారి తన వద్దకు వచ్చిన తల్లితో సంతోషంగా గడిపారు ప్రధాని. 2014, 2016 ఇలా రెండేళ్లు తన తల్లి వద్దకు వెళ్లిన ప్రధాని 2015 అమెరికా పర్యటనలో మాత్రం అమ్మను గుర్తుకు తెచ్చుకుని కన్నీటి పర్యంతం అయ్యారు.
ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో... మీ జీవితంలో మీ తల్లి పాత్ర ఏంటని అడిగిన ప్రశ్నతో మోదీ హావభావాలు ఒక్కసారిగా మారిపోయాయి. తనను పెంచేందుకు తల్లిపడ్డ కష్టాలు తలుచుకుని కంటతడిపెట్టారు. తన జీవితంలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమైనదన్నారు. తమది చాలా నిరుపేద కుటుంబమని… తాను రైల్వే స్టేషన్లో టీ అమ్మేవాడినని గుర్తు చేసుకున్నారు. చిన్న పిల్లలైన తమకు పెంచేందుకు అమ్మ చుట్టుపక్కల ఇళ్ళలో పని మనిషిగా ఉండేదన్నారు. పక్కిళ్లలో అంట్లు తోమేదని చెప్పారు. తన తల్లే కాకుండా భారతదేశంలో ఎంతో మంది తల్లులు తమ పిల్లలను పెంచేందుకు తమ జీవితం మొత్తం త్యాగం చేస్తున్నారని భావోద్వేగానికి గురయ్యారు.
ఇలా అమ్మతో అనుబంధాన్ని ఎప్పటికప్పుడు గుర్తుకు చేసుకునే ప్రధాని నరేంద్ర మోదీ నేడు తన 67వ పడిలోకి అడుగుపెట్టారు. ఊహించినట్లుగానే ఉదయమే తల్లి చెంత వాలిపోయిన ఆయన హీరాబెన్ నుంచి ఆశీర్వాదం తీసేసుకున్నారు. తల్లితో ముచ్చటించి సంతోషంగా గడిపారు. పుట్టినరోజు ప్రత్యేకంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద డ్యామ్ సర్దార్ సరోవర్‌ను కాసేపట్లో జాతికి అంకితం ఇవ్వనున్నారు.
మరోవైపు దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలు, పలువురు ప్రముఖులు మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే సన్నిహితులతోపాటు రాజకీయాలకతీతంగా ప్రత్యర్థుల నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకోవటం బహుశా మోదీకే చెల్లుతుందేమో.