
న్యూఢిల్లీ: ఏకంగా 800 కేజీల బరువైన అతిభారీ భగవద్గీత గ్రంథాన్ని ప్రధాని మోదీ మంగళవారం ఢిల్లీలోని ఇస్కాన్( అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘం) ఆలయంలో ఆవిష్కరించారు. 2.8 మీటర్ల ఎత్తు, రెండు మీటర్ల వెడల్పు ఉన్న ఈ మహా గ్రంథంలో 670 పేజీలు ఉన్నాయి. ఇటలీలోని మిలాన్ నగరంలో ఈ గ్రంథాన్ని అచ్చువేశారు. పేజీలను యుపో(వైయూపీవో) సింథటిక్ కాగితంతో తయారుచేశారు. ఈ కాగితం తడవదు, అస్సలు చిరగదు. గ్రంథంలో సందర్భోచితంగా 18 అత్యంత మనోహరమైన పెయింటింగ్‌లను పొందుపరిచారు. కాగా, భగవద్గీత ఆవిష్కరణ కార్యాక్రమానికి మోదీ ఢిల్లీ మెట్రో రైళ్లో వచ్చారు. ఖాన్ మార్కెట్ స్టేషన్ నుంచి నెహ్రూ ప్లేస్ మెట్రో స్టేషన్ వరకు ఆయన ప్రయాణించారు. ఆ సమయంలో తోటి ప్రయాణికులతో సరదాగా మాట్లాడి, సెల్ఫీలు దిగారు. తిరుగుప్రయాణంలోనూ కైలాశ్ కాలనీ స్టేషన్‌లో ఎక్కి ఖాన్‌మార్కెట్ స్టేషన్‌లో దిగిపోయారు.